ఆఫ్గాన్‌లో అమెరికా వైమానిక దాడులు.. 200 మందికి పైగా తాలిబన్లు మృతి

Over 200 Taliban Terrorists Killed In Airstrikes In Afghanistan. ఆఫ్గానిస్తాన్‌లో తాలిబన్లు లక్ష్యంగా చేసుకుని అమెరికా వైమానిక దాడులు

By Medi Samrat  Published on  8 Aug 2021 8:18 AM GMT
ఆఫ్గాన్‌లో అమెరికా వైమానిక దాడులు.. 200 మందికి పైగా తాలిబన్లు మృతి

ఆఫ్గానిస్తాన్‌లో తాలిబన్లు లక్ష్యంగా చేసుకుని అమెరికా వైమానిక దాడులు జరపడంతో 200 మందికి పైగా తాలిబన్లు మృతి చెందారు. ఈ విషయాన్ని ఆఫ్గాన్‌ రక్షణ శాఖ ప్రతినిధి ట్వీట్‌ చేశారు. షెబెర్గాన్‌ నగరంలో సమావేశం నిర్వహిస్తున్న తాలిబన్లపై అమెరికా వైమానిక దళం దాడులు జరపడంతో భారీ ప్రాణ నష్టం జ‌రిగింది. వైమానిక దాడుల్లో సుమారు 200 మందికి పైగా తాలిబన్లు చనిపోయారని రక్షణ మంత్రిత్వ శాఖ ప్రతినిధి ఫవాద్‌ అమన్‌ ట్వీట్‌ చేశారు. జవ్జాన్‌ ప్రావిన్స్‌లోని షెబెర్గాన్‌ నగరంలో తాలిబన్లు సమావేశం నిర్వహిస్తున్నారన్న సమాచారంతో శనివారం రాత్రి వైమానిక దాడులు చేశామని.. దీంతో ప్రాణ నష్టంతో పాటు వారి ఆయుధాలు, మందుగుండు సామాగ్రి, ఇతర వాహనాలు ధ్వంసమయ్యాయని చెప్పారు.

ఇదిలావుంటే.. కొన్ని రోజులుగా ఆప్గనిస్తాన్‌ అట్టుడుకుతోంది. తాలిబన్లు, ప్రభుత్వ దళాల మధ్య అక్కడ యుద్ధ వాతావరణం నెలకొంది. అమెరికా నాటో దళాలను వెనక్కు ఉపసంహరించుకున్న నాటి నుండి తాలిబన్లు పెట్రేగిపోతున్నారు. ఊళ్లకు ఊళ్లను బలవంతంగా తమ నిర్బంధంలోకి తీసుకుంటున్నారు. ప్రాంతాలను తమ చేతుల్లోకి బలవంతంగా తీసుకుంటున్నారు. ఇటీవల జవ్జాన్‌ ప్రావిన్స్‌ రాజధానిని తాలిబన్లు తమ చేతుల్లోకి తీసుకున్నారు.Next Story