కిలో ఉల్లి ధర రూ. 220.. టమోటా రేటు రూ.200 పైనే..

ఆఫ్ఘనిస్తాన్‌తో ఉద్రిక్తతల కారణంగా పాకిస్తాన్‌లో సరిహద్దు వాణిజ్యం నిలిచిపోయింది.

By -  Medi Samrat
Published on : 31 Oct 2025 8:25 AM IST

కిలో ఉల్లి ధర రూ. 220.. టమోటా రేటు రూ.200 పైనే..

ఆఫ్ఘనిస్తాన్‌తో ఉద్రిక్తతల కారణంగా పాకిస్తాన్‌లో సరిహద్దు వాణిజ్యం నిలిచిపోయింది. ఫలితంగా దేశ ఆర్థిక రాజధాని కరాచీలో ఉల్లి ధరలు ఆకాశాన్నంటాయి. ప్రస్తుతం కరాచీ ప్రజలు కిలో ఉల్లిని రూ.220 చొప్పున కొనుగోలు చేయాల్సి వస్తోంది. ఆఫ్ఘనిస్తాన్ నుండి వచ్చే ఇతర కూరగాయల పరిస్థితి కూడా ఇదే. టమాటా కూడా కిలో రూ.600-700కి చేరుకోగా.. ఇరాన్ నుంచి టమాటా దిగుమతవడంతో ధర రూ.200కి చేరింది.

రానున్న రోజుల్లో ఉల్లి ధరలు తగ్గే అవకాశం లేదని హోల్‌సేల్ వ్యాపారులు అంటున్నారు. డిమాండ్, సరఫరా మధ్య భారీ అంతరం కారణంగా ధరలు ఎక్కువగా ఉంటాయి. ఆర్థిక నిపుణుడు మాలిక్ బోస్తాన్ మాట్లాడుతూ.. కూరగాయలు పాడైపోయే వస్తువులు. కొరత ఏర్పడిన వెంటనే ధరలు పెరగడం ప్రారంభమ‌వుతుంద‌న్నారు.

ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. కరాచీ కమీషనర్ విడుదల చేసిన అధికారిక ధరలతో మార్కెట్ ధరలు సరిపోలడం లేదు. ఉల్లి అధికారిక ధర కిలో రూ.104 కాగా, మార్కెట్‌లో కిలో రూ.220 చొప్పున లభిస్తోంది. ఆఫ్ఘనిస్థాన్ సరిహద్దుల్లో ఉద్రిక్తత కారణంగా పాకిస్థాన్‌కు సరుకులు అంతగా రావడం లేదని హోల్‌సేల్ వ్యాపారి హాజీ షాజహాన్ తెలిపారు. అలాగే, ఇరాన్‌లో కూడా ధరలు ఎక్కువగానే ఉన్నాయి. పాకిస్థాన్‌లో అక్టోబర్ 2న విడుదల చేసిన సున్నితమైన ధరల సూచీ ప్రకారం.. ఇతర నగరాల్లో కూడా ఉల్లి ధరలు కిలో రూ.55 నుంచి రూ.140 వరకు ఉన్నాయి.

Next Story