ఉత్తరాఖండ్‌లోని పితోర్‌గఢ్ జిల్లాలో అర్ధరాత్రి భారత్, నేపాల్ సరిహద్దుల్లో ప్రవహించే లాస్కో నది ఉప్పొంగింది. మేఘ విస్ఫోటనం కారణంగా భారీ వర్షం కురిసింది. ఈ ఘటనలో ఓ మహిళ మృతి చెందగా, దాదాపు 30 ఇళ్లు ధ్వంసమయ్యాయి. "క్లౌడ్ బరస్ట్ ఘటనలో దాదాపు 30 ఇళ్లు ధ్వంసమయ్యాయి.. ఒక మహిళ మరణించింది" అని జిల్లా మేజిస్ట్రేట్ (DM) ఆశిష్ చౌహాన్ ANI కి తెలిపారు. ధార్చులలోని కాళీ నదికి రాత్రి వచ్చిన వరద కారణంగా ధార్చుల, పరిసర ప్రాంతాల్లో చాలా నష్టం చోటు చేసుకుంది. వరదల కారణంగా చాలా ఇళ్లు కొట్టుకుపోగా, కొన్ని ఇళ్లు దెబ్బతిన్నాయి. ఈ ఉదయం నదిలో బలమైన ప్రవాహం కారణంగా ఒక భవనం కూడా కూలిపోయి నీటిలో మునిగిపోయింది. నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (ఎన్‌డిఆర్‌ఎఫ్), స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్ (ఎస్‌డిఆర్‌ఎఫ్) బృందాలు సహాయక చర్యల్లో నిమగ్నమై ఉన్నాయి. కాళీ నదిలో వరదల కారణంగా భారతదేశం-నేపాల్ దేశాలలోని గ్రామాలలో నష్టం జరిగింది. ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
ఆగస్టు 20న, డెహ్రాడూన్‌లో క్లౌడ్ బరస్ట్ కారణంగా ఊహించని ఇబ్బందులు ఎదురయ్యాయి. భారీ నీటి ప్రవాహం వివిధ రహదారులను దెబ్బతీసింది. "వివిధ ప్రాంగణాల్లోకి నీరు చేరడం.. అనేక ప్రాంతాల్లో రోడ్లు దెబ్బతిన్నట్లు మాకు నివేదికలు అందాయి. SDRF, NDRF సహాయక, పునరుద్ధరణ కార్యకలాపాలను నిర్వహిస్తున్నాయి" అని SDRF డెహ్రాడూన్ కమాండెంట్ మణికాంత్ మిశ్రా తెలిపారు. ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి డెహ్రాడూన్‌లోని రాయ్‌పూర్‌లోని సర్ఖేత్ గ్రామంలో బాధిత ప్రాంతాలను పరిశీలించారు.