మహమ్మారి కరోనా వైరస్ మరో కొత్త రూపం దాల్చి ప్రజలను భయపెడుతోంది. దక్షిణాఫ్రికా సహా పలు దేశాల్లో కరోనాకు చెందిన ఒమిక్రాన్ అనే కొత్త వేరియంట్ విజృంభిస్తోంది. డెల్టా వేరియంట్ కంటే ఈ ఒమిక్రాన్ వేరియంట్ ప్రమాదకరమని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్పింది. ఈ కొత్త రకం వైరస్‌తో అప్రమత్తంగా ఉండాలని ఆగ్నేయ ఆసియా దేశాలకు డబ్ల్యూహెచ్‌వో హెచ్చరికలు చేసింది. ఆగ్నేయ ఆసియా ప్రాంత డబ్ల్యూహెచ్‌వో డైరెక్టర్ పూనం ఖేత్రపాల్ సింగ్ మాట్లాడుతూ.. "ప్రత్యేక నిఘాతో పాటు ప్రజల ఆరోగ్య వ్యవస్థల్ని బలోపేతం చేయాలి. కొవిడ్ వ్యాక్సినేషన్ మరింతం వేగవంతం చేయాలి. అలాగే వైరస్ వ్యాప్తికి ఛాన్స్ లేకుండా అవసరమైన చర్యలు చేపట్టాలని" అన్నారు.
పండుగులతో పాటు ఇతర వేడుకలను కొవిడ్ నిబంధనలకు లోబడి జరుపుకోవాలన్నారు. భౌతిక దూరం పాటించడం మాత్రం మర్చిపోవద్దని సూచించారు. ఆగ్నేసియాలోని అనేక దేశాల్లో వైరస్ కేసులు తగ్గుముఖం పట్టినప్పటికీ, ప్రపంచంలోని ఇతర చోట్ల కేసుల పెరుగుదల, కొత్త వేరియంట్ నిర్ధారణ అనేది నిరంతర ప్రమాదాన్ని గుర్తుచేస్తోందన్నారు. వైరస్ నుండి రక్షించడానికి, దాని వ్యాప్తిని నిరోధించడానికి మన వంతు కృషిని కొనసాగించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కొత్త వేరియంట్‌పై ప్రపంచ దేశాలు తప్పనిసరిగా నిఘా, సీక్వెన్సింగ్‌ను పెంచాలని ఆమె అన్నారు.
అంతర్జాతీయ ప్రయాణాల ప్రమాదాన్ని అంచనా వేసి తదనుగుణంగా చర్యలు తీసుకోవాలని ఆమె అన్నారు. కొవిడ్ -19 ఎంత ఎక్కువ వ్యాప్తి చెందుతుందో, వైరస్ మారడానికి, పరివర్తన చెందడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి అని రీజినల్ డైరెక్టర్ చెప్పారు. ముక్కు, నోటిని కప్పి ఉంచే మాస్క్‌ను ధరించడం ద్వారా వైరస్‌కు గురయ్యే వారి ప్రమాదాన్ని తగ్గించడం చాలా ముఖ్యమైన విషయం అన్నారు. భౌతిక దూరం, చేతులు శుభ్రంగా ఉంచుకోవడం, దగ్గు, తుమ్ములను కవర్ చేయడం, వ్యాక్సిన్ వేసుకోవడం ద్వారా ఈ ప్రమాదం నుండి గట్టెక్కవచ్చన్నారు.