ఆలూ, టమాటా ధరలను తెలుసుకోవడానికి రాజకీయాల్లోకి రాలేదు

Not In Politics For Aloo Tamatar Rates Imran Khan On Pak Inflation. ఆలు, టమటా ధరలను తనిఖీ చేయడానికి తాను రాజకీయాల్లోకి రాలేదని పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అన్నారు.

By Medi Samrat  Published on  14 March 2022 5:38 AM GMT
ఆలూ, టమాటా ధరలను తెలుసుకోవడానికి రాజకీయాల్లోకి రాలేదు

ఆలు, టమటా ధరలను తనిఖీ చేయడానికి తాను రాజకీయాల్లోకి రాలేదని పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అన్నారు. ఆదివారం ఆయ‌న మాట్లాడుతూ.. పార్లమెంటులో తనపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన ప్రతిపక్ష పార్టీలపై మాట‌ల‌ దాడి చేశారు. ద్రవ్యోల్బణం, ఆర్థిక వ్యవస్థను తప్పుగా నిర్వచించారని ఆరోపించారు. పంజాబ్ ప్రావిన్స్‌లోని హఫీజాబాద్ నగరంలో రాజకీయ ర్యాలీని ఉద్దేశించి ఇమ్రాన్ ఖాన్ మాట్లాడుతూ.. డబ్బును ఉపయోగించి [చట్టకర్తల] మనస్సాక్షిని కొనుగోలు చేయడం ద్వారా ప్రభుత్వాన్ని పడగొట్టడానికి ప్రయత్నిస్తున్న అంశాలకు వ్యతిరేకంగా దేశం నిలబడాలని అన్నారు.

తన పదవీకాలంలో పాకిస్థాన్ గొప్ప దేశంగా అవతరించబోతోందని.. తమ ప్రభుత్వం ప్రకటించిన ప్రోత్సాహకాలు త్వరలోనే ఫలితాలను ఇస్తాయని ఆయన అన్నారు. 25 సంవత్సరాల క్రితం దేశ యువత కోసం రాజకీయాల్లోకి రావాలని నిర్ణయించుకున్నానని.. దీని వల్ల నాకు వ్యక్తిగత లాభాలు ఏమీ లేవని.. జీవితంలో ఒక వ్యక్తికి కావ‌ల్సిన‌ ప్రతిదీ నాకు ఇప్పటికే ఉందని 69 ఏళ్ల ఇమ్రాన్ ఖాన్‌ అన్నారు. నేను ఆలూ, టొమాటో ధరలను తెలుసుకోవడానికి రాజకీయాల్లో చేరలేదని.. దేశ యువత కోసం రాజ‌కీయాల్లోకి వ‌చ్చాన‌ని అన్నారు. పాక్‌ గొప్ప దేశంగా మారాలంటే.. మనం సత్యానికి మద్దతు ఇవ్వాలని.. ఇదే తాను గత 25 సంవత్సరాలుగా బోధిస్తున్నానని ఇమ్రాన్ ఖాన్ అన్నారు.

జాతీయ అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు, పాకిస్థాన్ ముస్లిం లీగ్-నవాజ్ (పీఎంఎల్-ఎన్) అధ్యక్షుడు షెహబాజ్ షరీఫ్ నివాసంలో ప్రతిపక్ష పార్టీల ముఖ్య నాయకులు నేడు సమావేశం కానున్నారు. ఈ సందర్భంగా అవిశ్వాస తీర్మానాన్ని నెగ్గించుకుని ఇమ్రాన్ ప్రభుత్వాన్ని గద్దె దింపేందుకు సమర్థవంతమైన వ్యూహాన్ని రచించనున్నారు. ప్రతిపక్షాలు ఏకమై తనకు వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన నేపథ్యంలో ఇమ్రాన్ ఈ వ్యాఖ్యలు చేశారు.












Next Story