క్షిపణి ప్రయోగాలు చేసిన ఉత్తర కొరియా..

North Korea's ballistic missile test in Seoul. ఎవరు ఏది వద్దని అంటారో అదే చెయ్యటం ఉత్తర కొరియా అధినేత కిమ్ జొంగ్ ఉన్ కి అలవాటు

By Medi Samrat  Published on  27 March 2021 3:57 AM GMT
క్షిపణి ప్రయోగాలు చేసిన ఉత్తర కొరియా..

ఎవరు ఏది వద్దని అంటారో అదే చెయ్యటం ఉత్తర కొరియా అధినేత కిమ్ జొంగ్ ఉన్ కి అలవాటు. ఉద్రిక్తతలు పెంచడానికి ప్రయత్నిస్తే తీవ్ర పరిణామాలు తప్పవని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ తమకు హెచ్చరికలు జారీచేశారని, వాటికి ప్రతిగా గురువారం కొత్త గైడెడ్ క్షిపణులను పరీక్షించామని ఉత్తర కొరియా స్పష్టంచేసింది. శుక్రవారం కొరియా అధికారిక వార్తా సంస్థ అయిన కేసీఎన్ఏ ద్వారా అధికారిక ప్రకటనను విడుదల చేసింది. మిసైళ్లను ప్రయోగించిన ఫొటోలను విడుదల చేసింది. అవి తూర్పు తీరంలోని నిర్దేశిత లక్ష్యాలను ఛేదించాయని తెలిపింది. వీటివల్ల తమ సైనిక శక్తి మరింత బలోపేతమవుతుందని పేర్కొంది.

రెండున్నర టన్నుల పేలోడ్ లను ఇవి మోసుకెళ్లగలవని, అణు బాంబులు తీసుకెళ్లే సామర్థ్యం ఉందని తెలిపింది. ఈ రెండు క్షిపణులు ఉత్తర కొరియా సైన్యాన్ని మరింత బలోపేతం చేస్తాయని క్షిపణుల ప్రయోగాన్ని పర్యవేక్షించిన సైనికాధికారి రి ప్యోంగ్ చోల్ చెప్పారు. క్షిపణుల ప్రయోగాన్ని దగ్గరుండి పరిశీలిస్తున్న సైనికాధికారుల ఫొటోనూ ఉత్తర కొరియా విడుదల చేసింది.

బైడెన్ అమెరికా అధ్యక్షుడయ్యాక కొరియా చేసిన తొలి బాలిస్టిక్ మిసైల్ ప్రయోగం ఇదే కావడం గమనార్హం. దీనిపై సందర్భం వచ్చినప్పుడు స్పందిస్తామని బైడెన్ అన్నారు. ఈ రెండూ బాలిస్టిక్‌ క్షిపణులని, ఐరాస భద్రతా మండలి తీర్మానాల ప్రకారం వాటిని ఉత్తర కొరియా పరీక్షించరాదని జపాన్‌ అధికారులు స్పష్టంచేశారు.

మొత్తానికి ఏడాది కిందట ఆచూకీ తెలియకుండా, బాహ్య ప్రపంచానికి దూరంగా గడిపిన ఉత్తర కొరియా నియంత.. ఈ సారి అనూహ్యంగా వార్తల్లోకెక్కారు. ప్రపంచం ఒకవైపు.. తాను ఒక్కడిని ఒకవైపు అంటూ వ్యవహరిస్తోన్న కిమ్ జొంగ్ అందరూ కరోనా మహమ్మారి కట్టడి గురించి ఆలోచిస్తున్న తరుణంలో క్షిపణి ప్రయోగాలు చేసి తన నియంత వైఖరిని మరోసారి బయట పెట్టుకున్నారు




Next Story