ఉత్తర కొరియా బుధవారం కనీసం 17 క్షిపణులను సముద్రంలోకి ప్రయోగించింది. అందులో ఒకటి దక్షిణ కొరియా తీరానికి 60 కిమీ (40 మైళ్ళు) కంటే తక్కువ దూరంలో పడింది. దీనిని దక్షిణ కొరియా తప్పుబట్టింది. దక్షిణ కొరియా అధ్యక్షుడు.. దీనికి మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. 1945లో కొరియా రెండు భాగాలుగా విభజించబడిన తర్వాత దక్షిణ కొరియాకు దగ్గరగా బాలిస్టిక్ క్షిపణి ల్యాండ్ కావడం ఇదే మొదటిసారి. దీంతో దక్షిణ కొరియా వైమానిక దాడులకు సంబంధించి హెచ్చరికలు జారీ చేసింది. అంతేకాకుండా క్షిపణులను ప్రయోగించింది.
మరో వైపు.. ఉత్తర కొరియా క్షిపణి పరీక్షలు చేస్తుండటంతో అమెరికా, దక్షిణ కొరియా సంయుక్తంగా 200 యుద్ధవిమానాలతో విన్యాసాలు చేస్తున్నాయి. అమెరికాతో కలిసి దక్షిణకొరియా చేస్తున్న సంయుక్త వైమానిక విన్యాసాలపై ఉత్తర కొరియా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కొరియా ద్వీపకల్పంలో శాంతిభద్రతలను అమెరికా నాశనం చేస్తోందని.. దురాక్రమణకు సాహసిస్తే ధీటుగా ఎదుర్కొంటామని హెచ్చరించింది.