2021 సంవత్సరానికి గాను ప్రతిష్ఠాత్మక నోబెల్ శాంతి బహుమతి మారియా రెసా, దిమిత్రి మురతోవ్ లను వరించింది. భావ ప్రకటన స్వేచ్ఛను కాపాడేందుకు వారు చేసిన కృషికి గుర్తింపుగా నోబెల్ శాంతి బహుమతిని వీరికి ప్రకటించారు. సుస్థిర ప్రజాస్వామ్యానికి, చిరకాల శాంతికి భావ వ్యక్తీకరణ స్వాతంత్ర్యమే పునాది అని బలంగా నమ్మి, ఆచరించారని నోబెల్ కమిటీ అభిప్రాయపడింది. మారియా రెసా ఫిలిప్పినో-అమెరికన్ పాత్రికేయురాలు. సీఎన్ఎన్ ఆగ్నేయాసియా విభాగంలో 20 ఏళ్ల పాటు ఇన్వెస్టిగేటివ్ రిపోర్టర్ గా బాధ్యతలు నిర్వర్తించారు. వ్యక్తి వాక్ స్వేచ్ఛను అనేక వేదికలపై నిర్భయంగా చాటారు.
ఫిలిప్పీన్స్ చట్టాల ప్రకారం అనేక ఆరోపణలు ఎదుర్కొన్నప్పటికీ, ఓసారి అరెస్ట్ అయినప్పటికీ తాను నమ్మిన సిద్ధాంతాలకే కట్టుబడ్డారు. దిమిత్రి మురతోవ్ రష్యా జాతీయుడు. పాత్రికేయ రంగానికి చెందిన మురతోవ్ రష్యన్ దినపత్రిక నోవాయా గెజెటాకు ఎడిటర్ ఇన్ చీఫ్ గా వ్యవహరించారు. రష్యా ప్రభుత్వ అవినీతిని ఎండగట్టడంలోనూ, మానవ హక్కుల ఉల్లంఘనలపై నిలదీయడంలోనూ నోవాయా గెజెటాకు విశిష్ట గుర్తింపు ఉంది. అందుకు కారకుడు దిమిత్రి మురతోవ్ అని అంటుంటారు. ఇప్పటికే ఆయన ఎన్నో పురస్కారాలను అందుకున్నారు. ఇప్పుడు ఏకంగా నోబెల్ శాంతి బహుమతిని అందుకున్నారు.