భారత జలాల్లోకి దూసుకొచ్చిన అమెరికా నేవీ

No prior consent, US Navy holds drill in Indian waters. ఏదేశ నేవీ అయినా.. మరో దేశ జలభాగంలోకి ప్రవేశించాలంటే ముందుగా

By Medi Samrat  Published on  10 April 2021 4:00 AM GMT
భారత జలాల్లోకి దూసుకొచ్చిన అమెరికా నేవీ

ఏదేశ నేవీ అయినా.. మరో దేశ జలభాగంలోకి ప్రవేశించాలంటే ముందుగా ఆ దేశ అనుమతి తీసుకోవాల్సిందే. కానీ.. యూఎస్ నేవీ మాత్రం అలా చేయలేదు. పైగా అత్యుత్సాహం ప్రదర్శించింది. అమెరికా నేవీకి చెందిన యుద్ధ నౌకలు భారతదేశ అనుమతి లేకుండానే భారత జలాల్లోకి ప్రవేశించాయి. లక్షద్వీప్ దీవుల సమీపానికి చేరుకున్నాయి. భారత జలాలు వేదికగా నేవి ఇండిపెండెన్స్ పై ప్రచారాన్ని ప్రారంభించాయి.

ఏప్రిల్ 7, 2021న యూఎస్ఎస్ జాన్ పాల్ జోన్స్(డిడిజి53) నౌక భారత అనుమతి లేకుండా భారత జలాల్లోకి ప్రవేశించింది. పశ్చిమాన ఉన్న లక్షద్వీప్ సమూహానికి చేరుకుంది. యూఎస్‌కు చెందిన ఏడవ నౌకాదళ కమాండర్ ఈ విషయానికి సంబంధించి అధికారిక ప్రకటన విడుదల చేశారు. భారత భూభాగానికి 130 నాటికల్ మైళ్ల దూరంలో నేవీ హక్కులు, స్వేచ్ఛ అనే అంశంపై ప్రచారాన్ని ప్రారంభించినట్లు పేర్కొన్నారు. అంతర్జాతీయ చట్టం ప్రకారమే దీనిని నిర్వహించడం జరిగిందన్నారు.

అయితే అంతర్జాతీయ చట్టం అంటూ ప్రకటనలు చేయడంపై అనుమానాలు రేకెత్తుతున్నాయి. వాస్తవానికి అమెరికా భారత్‌కు అత్యంత సన్నిహిత, వ్యూహాత్మక భాగస్వామ్య దేశాలలో ఒకటి. దక్షిణ చైనా సముద్రంలో చైనా విస్తరణ వాదాన్ని ఇరు దేశాలూ వ్యతిరేకించాయి కూడా. ఇదే సమయంలో భారత్-అమెరికా దేశాలకు చెందిన నావికాదళాలు ఏడాది పొడవునా విన్యాసాలు చేస్తూనే ఉంటాయి. అయితే, భారతదేశ ప్రాదేశిక జలాలలో సైనిక విన్యాసాలు చేయాలన్నా, సదరు యుద్ధ నౌకలు దేశ జలాల్లోకి ప్రవేశించాలన్నా భారత ప్రభుత్వం అనుమతి తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుంది. కానీ, యూఎస్ నేవీ మాత్రం ఎలాంటి అనుమతులు తీసుకోలేదు.

పరస్పరం సహకరించుకుందామని ఇటీవలి 'క్వాడ్' సమావేశంలో అమెరికా కల్లబొల్లి కబుర్లు చెప్పింది. సముద్ర జలాల్లో భాగస్వామ్యంతో ముందుకు పోదామని మాటలు చెప్పింది. కానీ, ఇప్పుడు మన అనుమతి లేకుండానే మన జలాల్లోకి ప్రవేశించి ఆపరేషన్ చేసింది. పైగా తమకు ఆ హక్కుందని, ఇంతకుముందూ చేశామని.. ఇకపైనా చేస్తామని చెప్పుకొచ్చింది. అదే సమయంలో అనుమతి లేకుండా భారత్ ఇలాంటివి చేయడానికి లేదని వ్యాఖ్యానించింది. ఈ ఘటనపై భారత అధికారులు కంగుతిన్నారు. విదేశాంగ శాఖ ఇంకా స్పందించాల్సి ఉంది.


Next Story