భారత్‌లోని పలు బ్యాంకులకు వేల కోట్ల రూపాయల కుచ్చు టోపీ పెట్టి.. బ్రిటన్ పారిపోయిన వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీకి అక్కడి హైకోర్టులో చుక్కెదురైంది. నీరవ్ మోదీని భారత్‌కు అప్పగించాలని బ్రిటన్ హైకోర్టు ఆదేశాలు జారీ చేస్తూ.. భారత ప్రభుత్వ అభ్యర్థనను సవాల్ చేస్తూ పరారీలో ఉన్న నీరవ్ మోదీ దాఖలు చేసిన పిటిషన్‌ను బుధవారం కొట్టివేసింది. మనీలాండరింగ్ కేసుల విచారణ నిమిత్తం నీరవ్‌ను భారత్‌కు అప్పగించాలని యునైటెడ్ కింగ్‌డమ్‌లోని హైకోర్టు ఆదేశాలిచ్చింది. నీరవ్ మోదీని అప్పగించడం అన్యాయం లేదా అణచివేత కాదని కోర్టు పేర్కొంది.
రూ.13,000 కోట్ల పంజాబ్ నేషనల్ బ్యాంక్ కుంభకోణంలో 51 ఏళ్ల నీరవ్ మోదీ ప్రధాన నిందితుడు. పంజాబ్ నేషనల్ బ్యాంకులో జరిగిన భారీ స్కామ్ వెలుగులో రావడంతో దర్యాప్తు ఏజెన్సీల విచారణ ప్రారంభించడంతో అతను భారత్ నుండి పారిపోయాడు. అక్టోబర్ 12న నీరవ్ మోదీ పిటిషన్‌పై కోర్టు తన తీర్పును రిజర్వ్‌లో ఉంచింది. భారత్‌కు అప్పగించడాన్ని వ్యతిరేకిస్తూ నీరవ్ మోదీ చేసిన పిటిషన్‌ను విచారించిన న్యాయస్థానం.. భారత్ స్నేహపూర్వక విదేశీ బంధం, యూకే తన అప్పగింత ఒప్పంద బాధ్యతలను తప్పక పాటించాలని పేర్కొంది. కాగా ముంబైలోని ఆర్థర్ రోడ్ జైలులో నీరవ్ మోదీకి తగిన వైద్యం అందిస్తామని భారత ప్రభుత్వం హామీ ఇచ్చింది.