న్యూజిలాండ్ లో ఆరు నెలల తర్వాత తొలి కరోనా కేసు నమోదైంది. ఈ నేపథ్యంలో ఆ దేశ ప్రభుత్వం మూడు రోజుల లాక్‌డౌన్ ప్రకటించింది. ఈ విషయమై న్యూజిలాండ్ ప్రధాని జెసిండా ఆర్డెర్న్ మాట్లాడుతూ.. నమోదైన కేసును డెల్టా వేరియంట్ గా అనుమానిస్తున్నట్టు తెలిపారు. గడిచిన ఆరు నెలలుగా ఒక్క కరోనా కేసు నమోదు కానప్పటికీ.. డెల్టా వేరియంట్ నేపథ్యంలో ఛాన్స్ తీసుకోదలుచుకోలేదని జెసిండా అన్నారు. తక్షణమే స్పందించని పక్షంలో ఎలాంటి పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుందో.. ఇతర దేశాలను చూసి తెలుసుకోవచ్చని చెప్పారు. డెల్టా వేరియంట్ బారిన పడకుండా ఉండేందుకు మనకు కేవలం ఒక్క ఛాన్స్ మాత్రమే ఉంటుందని అన్నారు.
డెల్టా వేరియంట్ అత్యంత వేగంగా వ్యాప్తి చెందుతుందని.. దీని కారణంగా ఆస్ట్రేలియా పడుతున్న ఇబ్బందులను గురించి జెసిండా వివరించారు. కరోనా విషయంలో కఠినమైన నిర్ణయాలను తీసుకోవడం వల్లే మనం మహమ్మారిని కట్టడి చేయగలిగామని.. అదే మనల్ని కాపాడిందని తెలిపారు. ప్రారంభంలోనే లాక్ డౌన్ విధించడం వల్ల కొన్ని రోజులు మాత్రమే మనకు ఇబ్బంది ఉంటుందని అన్నారు. అలసత్యం ప్రదర్శించి, ఆలస్యంగా నిర్ణయాలు తీసుకుంటే ఎక్కువ కాలం పాటు లాక్‌డౌన్ లో ఉండాల్సి వస్తుందని హెచ్చరించారు.