30 మ్యుటేషన్స్ ఉన్న కొత్త వేరియంట్.. తెగ టెన్షన్ పెడుతోంది..!
New Covid Variant In South Africa. కరోనా వైరస్ మహమ్మారిలో కొత్తగా 30కి పైగా మ్యుటేషన్లు ఉన్నాయట..!
By Medi Samrat Published on 26 Nov 2021 5:24 PM ISTకరోనా వైరస్ మహమ్మారిలో కొత్తగా 30కి పైగా మ్యుటేషన్లు ఉన్నాయట..! ఈ మాట వింటేనే మీకు షాకింగ్ గా అనిపిస్తోంది కదూ..! దక్షిణాఫ్రికాలో ఈ కొత్త వేరియంట్‌ను ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తించింది. ఆఫ్రికా ఖండంలోని పలు దేశాలకు వ్యాప్తి చెందినట్లు అనుమానిస్తోంది. శక్తిమంతమైన కరోనా స్ట్రెయిన్ వ్యాపిస్తుండడం అనేక దేశాలను కలవరపరుస్తోంది. ఈ సూపర్ స్ట్రెయిన్ కు బి.1.1529గా నామకరణం చేశారు. ఒక్క వేరియంట్ లో 30కి పైగా జన్యు ఉత్పరివర్తనాలు ఉండడం, వాటిలో కొన్ని స్పైక్ మ్యుటేషన్లు ఉండడంతో పరిశోధకులు షాక్ అవుతున్నారు. డెల్టా వేరియంట్ లో 15 వరకు ఉత్పరివర్తనాలు ఉండగా, బి.1.1529 సూపర్ స్ట్రెయిన్ లో అంతకు రెట్టింపు ఉన్నాయి. దక్షిణాఫ్రికా, బోట్సువానా, హాంకాంగ్ దేశాల్లో ఇది ఉనికిని చాటుకుంది.
ఈ నేపథ్యంలో 6 ఆఫ్రికా దేశాల నుంచి వచ్చే విమానాలపై బ్రిటన్ నిషేధం ప్రకటించింది. దక్షిణాఫ్రికా, బోట్సువానా, నమీబియా, జింబాబ్వే, లెసోతో, ఎస్వాటిని దేశాల నుంచి వచ్చే విమానాలకు తమ దేశంలో ప్రవేశం లేదని బ్రిటన్ ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. ఈ కొత్త రకం వేరియంట్‌కు శరవేగంగా వ్యాప్తి చెందే లక్షణాలు ఉన్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది. అన్ని దేశాలను అప్రమత్తం చేసింది. కొత్త రకం వేరియంట్ దక్షిణాఫ్రికా, బోట్సువానా సహా ఆసియాలోని హాంగ్‌కాంగ్‌లోనూ వెలుగులోకి వచ్చింది.
ఈ వైరస్ బారిన పడిన వారు.. దక్షిణాఫ్రికాలో పర్యటించారు. తమ స్వదేశానికి వెళ్లారు. అనంతరం వారు అనారోగ్యానికి గురయ్యారు. వారికి పరీక్షలను నిర్వహించగా.. బీ.1.1.529 బారిన పడినట్లు తేలింది. దక్షిణాఫ్రికాలోని ప్రిటోరియా శివార్లలోని ష్వానె మెట్రోపాలిటన్ ఏరియాలో ఈ వైరస్‌ను తొలిసారిగా గుర్తించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ జారీ చేసిన హెచ్చరికల నేపథ్యంలో భారత్ అప్రమత్తమైంది. కొత్త వేరియంట్ పై అప్రమత్తంగా ఉండాలని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్ రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు లేఖ రాశారు. హాంకాంగ్, దక్షిణాఫ్రికా దేశాల నుంచి వచ్చేవారిని నిశితంగా పరిశీలించాలని సూచించింది. దక్షిణాఫ్రికా సహా ఆఫ్రికన్ దేశాల ట్రావెల్ హిస్టరీ ఉన్న ప్రయాణికులను గుర్తించాలని రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది.