ఆఫ్ఘనిస్తాన్‌కు చెందిన 35 ఏళ్ల ముస్లిం మత గురువు ఖ్వాజా సయ్యద్ చిస్తీని గుర్తు తెలియని వ్యక్తులు మహారాష్ట్రలోని నాసిక్‌లో కాల్చి చంపారు. యేలా పట్టణంలో ఉన్న ఎంఐడీసీ ఓపెన్ ప్లాట్‌లో మంగళవారం సాయంత్రం ఈ మర్డర్ జరిగింది. ఈ ప్రాంతం ముంబైకి 200 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఖ్వాజా సయ్యద్ చిస్తీని 'సూఫీ బాబా'గా చెబుతుంటారు. దుండగులు బాధితుడి నుదుటిపై పిస్తోల్ పెట్టి కాల్చారు. దాంతో అతను అక్కడిక్కడే మృతిచెందినట్లు అధికారులు తెలిపారు. సూఫీ బాబాను చంపి అతనికి చెందిన ఎస్‌యూవీ వాహనాన్ని ఆగంతకులు ఎత్తుకెళ్లారు.
ఆఫ్ఘనిస్థాన్ నుంచి వచ్చిన ఈయన నాశిక్ లో ఉంటున్నారు. ఈ హత్యకు మతపరమైన కారణాలు ఉండకపోవచ్చని పోలీసులు అంటున్నారు. ఒక స్థలానికి సంబంధించి ఈ హత్య జరిగి ఉండొచ్చని పోలీసులు అంటున్నారు. స్థానిక ప్రజల సహకారంతో ఛిస్తీ కొంత భూమిని తీసుకున్నారని.. ఆఫ్ఘనిస్థాన్ పౌరుడు కావడంతో మన దేశంలో ఆయన భూమిని కొనుగోలు చేయలేని పరిస్థితుల్లో స్థానికుల సహకారంతో భూమిని సేకరించారని చెప్పారు. ఈ భూ వ్యవహారమే హత్యకు కారణమై ఉండొచ్చని అనుమానిస్తున్నట్టు తెలిపారు. హంతకులను పట్టుకోవడానికి ప్రయత్నిస్తూ ఉన్నామని పోలీసు అధికారులు తెలిపారు. డ్రైవరే ఆయను హత్య చేసి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.