పెరుగుతున్న మంకీపాక్స్ కేసులు.. అప్రమత్తమైన భార‌త్‌

Monkeypox Outbreak In Europe And North America.మంకీపాక్స్ కేసుల సంఖ్య క్ర‌మంగా పెరుగుతోంది. బ్రిట‌న్ లో తొలి కేసు బ‌య‌ట

By తోట‌ వంశీ కుమార్‌  Published on  21 May 2022 9:22 AM IST
పెరుగుతున్న మంకీపాక్స్ కేసులు.. అప్రమత్తమైన భార‌త్‌

మంకీపాక్స్ కేసుల సంఖ్య క్ర‌మంగా పెరుగుతోంది. బ్రిట‌న్ లో తొలి కేసు బ‌య‌ట ప‌డ‌గా.. అత్యంత వేగంగా మిగ‌తా దేశాల‌కు కూడా విస్త‌రిస్తోంది. స్పెయిన్, పోర్చుగ‌ల్, ఇట‌లీ, స్వీడ‌న్, కెన‌డా, అమెరికా వంటి దేశాల్లో గ‌త వారం మంకీ పాక్స్ కేసులు న‌మోదు కాగా.. బెల్జీయం, జ‌ర్మ‌నీ, ఫ్రాన్స్, ఆస్ట్రేలియా వంటి దేశాలు తాజాగా ఈ జాబితాలో చేరిపోయాయి. ఇప్ప‌టి వ‌ర‌కు బ్రిట‌న్‌లో 20,స్పెయిన్‌లో 23 కేసులు న‌మోదు అయ్యాయి. కేసుల సంఖ్య పెరుగుతున్న‌ప్ప‌టికీ వారిలో స్వ‌ల్ప ల‌క్ష‌ణాలే క‌నిపిస్తున్నాయి.

విదేశాల్లో మంకీపాక్స్ కేసులు పెరుగుతుండ‌డంతో భార‌త ప్ర‌భుత్వం అప్ర‌మ‌త్త‌మైంది. విదేశాల నుంచి వ‌చ్చే ప్ర‌యాణీకుల్లో అనారోగ్యంతో ఉన్న వారిని గుర్తించి వారిని ఐసోలేష‌న్ చేసి వారి న‌మూనాల‌ను పుణెలోని నేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాల‌జీలోని బీఎస్ఎల్-4కు పంపాలని ఆదేశాలు ఇచ్చిన‌ట్లు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయ తెలిపారు.

మంకీపాక్స్ అంటే ఏమిటీ..?

వాస్త‌వానికి ఇది ఇప్పుడే పుట్టుకొచ్చింది ఏమీ కాదు. 1958లోనే దీన్ని క‌నుగొన్నారు. ప్ర‌యోగ‌శాల‌లోని కోతుల్లో ఈ వైర‌స్‌ను గుర్తించారు. కాబ‌ట్టీ దీనికి మంకీపాక్స్‌గా నామ‌క‌ర‌ణం చేశారు. మాన‌వుల్లో 1970లో తొలి కేసు న‌మోదైంది. ఇది కూడా ఓ మ‌శూచి లాంటిదే. ఇది ఎక్కువ‌గా మధ్య, పశ్చిమ ఆఫ్రికాల్లోనే క‌నిపిస్తుంది. చాలా అరుదుగా మాత్ర‌మే ఇత‌ర ప్రాంతాలకు వ్యాపిస్తుంది. మంకీపాక్స్ సోకిన జంతువు కరిచినా, లేదంటే ఆ ఇన్ఫెక్షన్‌కు గురైన వ్యక్తి రక్తం, శరీర స్రావాలను తాకినా ఇది సోకుతుంది. అలాగే, నోటి నుంచి వెలువడే తుంపర్ల ద్వారా కూడా విస్తరిస్తుంది.

దీని ల‌క్ష‌ణాల విష‌యానికి వ‌స్తే.. జ్వరం, ముఖంపై దద్దుర్లు, ఒళ్లునొప్పులతో ప్రారంభమై రెండు నుంచి నాలుగు వారాలపాటు ఉంటాయి. కాగా.. తాజా వ్యాప్తిలో మ‌ర‌ణాలు సంభ‌వించ‌క‌పోవ‌డం ఊర‌ట క‌లిగించే అంశం.

Next Story