అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్ తొలిసారి భారత ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ కానున్నారు. ఈ సమావేశం వర్చువల్‌గా జరగనుందని అధికారులు తెలిపారు. ఆస్ట్రేలియా నిర్వహించనున్న క్వాడ్ సమావేశంలో ఆ ఇద్దరు నేతల భేటీ దాదాపు ఖరారైంది. క్వాడ్‌లోని సభ్యదేశాలైన అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా, ఇండియా త్వరలో భేటీ కానున్నట్లు ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోరిసన్ శుక్రవారం ప్రకటించారు. చైనా ఆధిపత్యాన్ని నియంత్రించేందుకు క్వాడ్ గ్రూపును ఏర్పాటు చేశారు. ఇండో-పసిఫిక్ రీజియన్‌లో చైనా దూకుడుకు అడ్డుకట్టవేసేందుకు అగ్ర నేతలు ఈ భేటీలో చర్చించబోతున్నారు.
సరిహద్దు అంశంలో భారత్-చైనా మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో జరగబోయే క్వాడ్ భేటీ ప్రధాన్యత సంతరించుకుంది. ఇండో-పసిఫిక్ ప్రాంతం శాంతి, శ్రేయస్సు, స్థిరత్వం కోసం ఈ నాలుగు దేశాల అధ్యక్షులు నిర్మాణాత్మకంగా కలిసి పని చేస్తారని ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోరిసన్ వెల్లడించారు.
జో బైడెన్ అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత ప్రధాని మోదీ ఆయనకు గత నెల 8న ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఆ తర్వాత ఇరు దేశాధ్యక్షులు తొలిసారిగా త్వరలో జరగబోయే క్వాడ్ సమావేశంలోనే కలవనున్నారు. ఇరు దేశాధినేతల మధ్య వర్చువల్ భేటీ జరగనుంది. క్వాడ్ మీటింగ్‌కు సంబంధించి భారత ప్రధానమంత్రి కార్యాలయం ఎటువంటి ప్రకటన వెలువడనప్పటికి సదస్సుకు మోదీ, బైడెన్ హాజరు అవుతారని ఆస్ట్రేలియా తెలిపింది.