ఓ వ్యక్తి తానెటువంటి తప్పు చేయలేదని చెబుతున్నా కూడా ఆ మూక అతడి మాటలను అసలు వినలేదు. అతడిని కొడుతూ, లాక్కుని వెళుతూ.. చివరికి చెట్టుకు ఉరి వేశారు. అప్పుడు కూడా అతడు చనిపోయే వరకూ రాళ్లతో కొట్టారు. ఈ ఘటన పాకిస్తాన్ లోని పంజాబ్ ప్రావిన్స్‌లో చోటు చేసుకుంది. ఖురాన్‌ను అపవిత్రం చేశారనే ఆరోపణతో ఒక వ్యక్తిని చిత్రహింసలకు గురిచేసిన మూక అతి దారుణంగా హత్య చేసింది. స్థానిక పోలీసులు నిందితులను అడ్డుకునే సాహసం చేయలేదు. బాధితుడిని సమీపంలోని ఓ ప్రాంతానికి ఈడ్చుకెళ్లి చిత్రహింసలు పెట్టి హత్య చేశారు. ఖనేవాల్ జిల్లాలోని మియాన్ చున్నూలోని పోలీస్ స్టేషన్ నుండి నిందితులను బయటకు పంపేశారు.
ఒక వ్యక్తి ఖురాన్‌లోని కొన్ని పేజీలను చింపి, ఆపై వాటిని తగులబెట్టాడనే ప్రచారం జంగిల్ డేరా గ్రామంలో చోటు చేసుకోవడంతో.. స్థానికులు మగ్రిబ్ ప్రార్థనల తర్వాత గుమిగూడి అతడిపై దాడి చేశారు. ఆ వ్యక్తి మాట వినడానికి ఎవరూ సిద్ధంగా లేరు. అతను దోషి అని నిర్ణయించేసిన గ్రామ పెద్దలు, గ్రామస్థులు అతన్ని మొదట చెట్టుకు ఉరివేసి, అతను చనిపోయే వరకు రాళ్లతో కొట్టారు. ఇటీవలి కాలంలో పాకిస్తాన్ లో ఇలాంటి ఘటనలు మరింత ఎక్కువవుతూ ఉన్నాయి. గత ఏడాది నవంబర్‌లో ఖైబర్ పఖ్తున్‌ఖ్వాలోని చర్సద్దా జిల్లాలో పవిత్ర ఖురాన్‌ను అపవిత్రం చేశారనే ఆరోపణపై ఏకంగా పోలీసు స్టేషన్ నే తగులబెట్టారు. కొద్ది నెలల కిందట శ్రీలంకకు చెందిన మేనేజర్ ను రోడ్డుపై అతి దారుణంగా చిత్ర హింసలు పెట్టి, సజీవ దహనం చేశారు.