ఢీకొన్న రెండు హెలీకాప్టర్స్.. నలుగురు దుర్మరణం
Mid-air collision between 2 helicopters in Australia. రెండు హెలికాప్టర్లు ఢీకొని నలుగురు మృతిచెందగా, ఏడుగురికి తీవ్రగాయాలైన ఘటన
By M.S.R Published on 2 Jan 2023 7:16 PM ISTరెండు హెలికాప్టర్లు ఢీకొని నలుగురు మృతిచెందగా, ఏడుగురికి తీవ్రగాయాలైన ఘటన ఆస్ట్రేలియాలో చోటుచేసుకుంది. రెండు టూరిస్టు హెలికాప్టర్లు ఢీకొనడంతో అందులో ఉన్న నలుగురు చనిపోగా, ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్వీన్స్ లాండ్ మెరైన్ పార్కు దగ్గర ఈ ఘటన జరిగింది. పర్యాటకులను రైడ్ కు తీసుకెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
ఆస్ట్రేలియాలోని గోల్డ్ కోస్ట్‌లోని బీచ్ పర్యాటకానికి బాగా ఫేమస్. సాధారణ రోజుల్లోనే ఇక్కడకి పెద్ద సంఖ్యలో పర్యాటకులు వస్తుంటారు. ఆస్ట్రేలియాలో వేసవి సెలవులు కావడంతో సందర్శకుల తాకిడి పెరిగింది. నూతన సంవత్సర వేడుకలు జరుపుకునేందుకు ఇక్కడికి పెద్ద సంఖ్యలో పర్యాటకులు తరలివచ్చారు. ప్రమాదానికి గురైన రెండు హెలికాప్టర్లలో ఒకటి బీచ్‌లో ల్యాండింగ్ అవుతుండగా.. అప్పుడే గాల్లోకి లేస్తున్న మరో హెలికాప్టర్ ఢీకొట్టింది. ప్రమాదం జరిగిన వెంటనే.. ఒక హెలికాప్టర్ ముక్కలై సీ వరల్డ్ రిసార్ట్ సమీపంలోని ఇసుకలో చెల్లాచెదురుగా పడిపోయింది. ఆ విమానంలో ప్రయాణిస్తున్న వారిలో నలుగురు దుర్మరణం పాలయ్యారు. క్రాష్ అయిన తర్వాత మరో హెలికాప్టర్ ఇసుకపై నెమ్మదిగా ల్యాండ్ అవ్వడంతో అందులో ఉన్నవారికి ప్రాణాపాయం తప్పింది.
"ఆ రెండు విమానాలు, ఢీకొన్నప్పుడు, క్రాష్ ల్యాండ్ అయ్యాయి. ఈరోజు నలుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. మరో ముగ్గురు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు," గ్యారీ వోరెల్, క్వీన్స్‌లాండ్ రాష్ట్ర పోలీసు యాక్టింగ్ ఇన్‌స్పెక్టర్ మీడియా సమావేశంలో చెప్పారు. ఘటన జరిగిన వెంటనే ప్రజలు, పోలీసులు సహాయం చేయడానికి ప్రయత్నించారు. పలువురికి ప్రథమ చికిత్సను చేశారు. ఆస్ట్రేలియన్ ట్రాన్స్‌పోర్ట్ సేఫ్టీ బ్యూరో ప్రమాదానికి గల కారణాలను తెలుసుకోవడానికి దర్యాప్తు ప్రారంభించింది.