కరోనా మహమ్మారి ఎన్నో దేశాల ప్రజలకు కునుకు లేకుండా చేస్తోంది. మొదటి, సెకండ్ వేవ్స్ చాలా దేశాలను అతలాకుతలం చేశాయి. ఇప్పుడు థర్డ్ వేవ్ ముప్పు పొంచి ఉంది. ఇలాంటి తరుణంలో మెక్సికోలో థర్డ్ వేవ్ మొదలవ్వడం.. ఆ దేశ అధికారులను, ప్రజలను టెన్షన్ పెడుతూ ఉంది.
మెక్సికోలో గతవారంతో పోలిస్తే.. ఈ వారం 29శాతం అధికంగా కేసులు నమోదయ్యాయని ఆ దేశ ఆరోగ్యశాఖ ఒక ప్రకటనలో వెల్లడించింది. ఈ మూడో దశ కరోనా కేసులు అనారోగ్య సమస్యలు కలిగిన వారికంటే యువతలోనే పెద్ద సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయని ఆరోగ్య శాఖ చెబుతోంది. గత ఏడాది సెప్టెంబర్ లో రెండో దశ ప్రారంభంతో పోలిస్తే మూడో దశ కేసులు చాలా అధికంగా ఉన్నాయని తెలిపారు. జూన్ వరకు తగ్గుతూ వచ్చిన కేసులు ఇటీవల భారీగా పెరగడంతో వైద్యులు, అధికారులు అప్రమత్తమయ్యారు. మెక్సికోలో కరోనా మూడో దశ ఆగస్టులో గరిష్ఠస్థాయిని తాకుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. థర్డ్ వేవ్ ప్రభావం యువకులపైనే అధికంగా ఉంటుందని పరిశోధకులు హెచ్చరించారని దేశ అధ్యక్షుడు ఆండ్రెస్ మానుయేల్ లోపెజ్ చెప్పారు.
యువతలో రోగనిరోధకశక్తి అధికంగా ఉండటం వల్ల మరణాల శాతం తక్కువగా ఉందని తెలిపారు. గత ఏడాది డిసెంబర్ నుంచి టీకాలు వేయడంతో వృద్ధుల్లో వైరస్ తీవ్రత తగ్గినట్టు అధికారులు చెబుతున్నారు. ఇప్పటివరకూ పెద్దవారిలో 39శాతం మందికి కనీసం ఒక టీకా మోతాదు అందినట్టు తెలిపారు.