ఇంస్టాగ్రామ్ మోడల్ ప్రాణాలు తీసిన ప్లాస్టిక్ సర్జరీ

Mexican Kim Kardashian Joselyn Cano Passes Away. తమ అందాలను పెంచుకోవడానికి పలువురు సెలెబ్రిటీలు ప్లాస్టిక్ సర్జరీలు

By Medi Samrat  Published on  20 Dec 2020 4:02 AM GMT
ఇంస్టాగ్రామ్ మోడల్ ప్రాణాలు తీసిన ప్లాస్టిక్ సర్జరీ

తమ అందాలను పెంచుకోవడానికి పలువురు సెలెబ్రిటీలు ప్లాస్టిక్ సర్జరీలు చేయించుకుంటూ ఉంటారు. ఒక లిమిట్ వరకు ప్లాస్టిక్ సర్జరీలు ఓకే కానీ శృతి మించితే ప్రాణాలకే ప్రమాదం.. గతంలో కూడా ఎంతో మంది సెలెబ్రిటీలు ప్లాస్టిక్ సర్జరీలతో ప్రాణాల మీదకు తెచ్చుకున్నారు. మరికొందరైతే ప్రాణాలనే పోగొట్టుకున్నారు. తాజాగా ఓ మోడల్ ప్లాస్టిక్ సర్జరీ కారణంగా ప్రాణాలను కోల్పోయింది. `మెక్సికన్ కిమ్ కర్థాషియన్`గా పాపులరైన ప్రముఖ మోడల్ కం నటి 'జోస్లిన్ కానో' ప్లాస్టిక్ సర్జరీ ఆపరేషన్ విఫలమై మరణించింది. జోస్లిన్ స్విమ్మింగ్ దుస్తుల డిజైనర్, టాప్ మోడల్ గా పేరు తెచ్చుకుంది. జోస్లిన్ కానో ఇన్స్టాగ్రామ్ ఖాతాలో 12.9 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు.

జోస్లిన్ కానో తోటి మోడల్ లిరా మెర్సెర్ మాట్లాడుతూ ప్లాస్టిక్ సర్జరీ కారణంగా జోస్లిన్ కానో ప్రాణాలను కోల్పోయిందని వెల్లడించారు. జోస్లిన్ కానో కొలంబియాలో శస్త్రచికిత్స చేయించుకుని మరణించారని.. అందమైన జీవితాన్ని కోల్పోయారని తెలిపింది. జోస్లిన్ అంత్యక్రియల వీడియో యూట్యూబ్ లో లభించడంతో కొందరు అభిమానులు ఈ వార్తలను ధృవీకరించారు. కాలిఫోర్నియాలోని రివర్సైడ్ లోని ఏక్స్ ఫ్యామిలీ ఫ్యూనరల్ హోమ్ ఈ వీడియోను అప్ లోడ్ చేసింది. ఈ వీడియో ప్రకారం.. జోసెలిన్ 1990 మార్చి 14న జన్మించింది. 2020 డిసెంబర్ 07 నాటికి ఆమె చనిపోయిందని వెల్లడించారు.

'బ్రెజిలియన్ బట్ లిఫ్ట్' సర్జరీ చేయించుకోవడానికి జోసెలిన్ కొలంబియాకు వెళ్లింది. మోడల్ కం డిజైనర్ వ్యక్తిగత ఇన్ స్టా గ్రామ్ పేజీ చివరిసారిగా డిసెంబర్ 7 న అప్ డేట్ అయ్యి ఉంది. ఆమె స్విమ్మింగ్ దుస్తుల బ్రాండ్ పేజీ డిసెంబర్ 8 న ఒక చిత్రాన్ని పోస్ట్ చేసింది. ఆమె ఈత దుస్తుల బ్రాండ్ కి సంబంధించి కానీ.. ఆమె మరణానికి సంబంధించి కానీ కుటుంబ సభ్యులు ఎవరూ మరణాన్ని ధృవపరుస్తూ ఏదీ చెప్పలేదు. మీడియాలో మాత్రం మెక్సికన్ కిమ్ కర్థాషియన్ చనిపోయిందంటూ కథనాలు వస్తున్నాయి.


Next Story