హిందూ ఆచారం ప్రకారం ఒక్కటైన మెక్సికన్ జంట
Mexican couple ties the knot in Agra. తాజ్‌మహల్‌ను సందర్శించిన తర్వాత మెక్సికన్ జంట ఆగ్రాలో హిందూ ఆచారాల ప్రకారం వివాహం చేసుకున్నారు.
By Medi Samrat Published on 17 Sept 2022 8:30 PM ISTతాజ్‌మహల్‌ను సందర్శించిన తర్వాత మెక్సికన్ జంట ఆగ్రాలో హిందూ ఆచారాల ప్రకారం వివాహం చేసుకున్నారు. ఈ జంట తాజ్ నగరిలోని శివాలయంలో హిందూ సంప్రదాయంలో వివాహం చేసుకున్నారు. ఈ వివాహానికి స్థానికంగా ఉన్న కొందరు స్నేహితులు హాజరయ్యారు. పెళ్లి తర్వాత అందరూ కలిసి రెస్టారెంట్‌లో భోజనం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక టూర్ ఆపరేటర్లు, గైడ్‌లు, డ్రైవర్లు, హోటల్ యజమానులు కూడా పాల్గొన్నారు. విదేశీ జంట వివాహ వేడుకల ఏర్పాట్ల బాధ్యతను స్థానిక హోటల్ వ్యాపారి గౌరవ్ గుప్తా స్వీకరించారు. క్లాడియా, సెరామికో పెళ్లి చేసుకున్నారు. క్లాడియా మాట్లాడుతూ, "తాజ్ మహల్ కథ విన్నప్పుడు, మేము షాజహాన్ మరియు ముంతాజ్ ల ప్రేమకథకు ముగ్ధులయ్యాము. మా ప్రేమను శాశ్వతంగా మరియు చిరస్మరణీయంగా ఉంచాలని కోరుకున్నాము. దానిని దృష్టిలో ఉంచుకుని, మేము భారతదేశాన్ని సందర్శించాలని ప్లాన్ చేసాము. ఆపై హిందూ ఆచారాల ప్రకారం వివాహ వేడుకలు పూర్తి చేయాలని నిర్ణయించుకున్నాం." అని చెప్పుకొచ్చారు.
ప్రేమకు చిహ్నమైన నగరం ఆగ్రాలోనే తాము వివాహం చేసుకోవాలనుకున్నామని తెలిపారు. సూర్యోదయాన్ని తాజ్‌మహల్ వద్ద వీక్షించి ఆపై మధ్యాహ్నం వివాహ బంధంతో ఒక్కటయ్యామని చెప్పారు. వెడ్డింగ్ డిన్నర్‌కు వచ్చిన గ్రూపు సభ్యులు, ఆహ్వానితులతో కలిసి కొత్త జంట రెస్టారెంట్‌లో నృత్యం చేయడం అందరినీ ఆకర్షించింది. ఆగ్రాలో విదేశీ జంట వచ్చి పెళ్లి చేసుకోవడం ఇదే తొలిసారి కాదు. ఇంతకు ముందు కూడా ప్రపంచం నలుమూలల నుండి వచ్చి ఆగ్రాలో హిందూ ఆచారాల ప్రకారం వివాహం చేసుకున్న జంటలు చాలా ఉన్నాయి. 2019లో కూడా మెక్సికోకు చెందిన 4 జంటలు హిందూ సంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకున్నారు.