'అవ‌న్నీ విజయానికి చిహ్నాలు అయితే.. సంతోషించండి'.. ఐక్యరాజ్యసమితిలో పాక్ ప్ర‌ధానికి గ‌ట్టి కౌంట‌రిచ్చిన‌ భారత్..!

ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో పాక్ ప్రధాని షాబాజ్ షరీఫ్ మరోసారి విషం చిమ్మారు. ఇది మాత్రమే కాదు, ఆయ‌న‌ ఒక విచిత్రమైన వాదనను చేశాడు.

By -  Medi Samrat
Published on : 27 Sept 2025 9:43 AM IST

అవ‌న్నీ విజయానికి చిహ్నాలు అయితే.. సంతోషించండి.. ఐక్యరాజ్యసమితిలో పాక్ ప్ర‌ధానికి గ‌ట్టి కౌంట‌రిచ్చిన‌ భారత్..!

ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో పాక్ ప్రధాని షాబాజ్ షరీఫ్ మరోసారి విషం చిమ్మారు. ఇది మాత్రమే కాదు, ఆయ‌న‌ ఒక విచిత్రమైన వాదనను చేశాడు. భారత్‌తో పాక్‌ శాంతిని కోరుకుంటున్నట్లు చెప్పాడు. ఆయన వ్యాఖ్యలపై భారత్‌ స్పందించింది.

ఐక్యరాజ్యసమితిలో షెహబాజ్ షరీఫ్ చేసిన ప్రసంగంపై.. పాకిస్తాన్ ప్రధానికి నిజంగా నిజాయితీగా ఉంటే.. మార్గం స్పష్టంగా ఉందని భారత్‌ పేర్కొంది. పాకిస్థాన్‌ వెంటనే ఉగ్రవాద శిబిరాలను మూసివేయాలని కండిషన్ పెట్టింది.

ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో పాకిస్థాన్‌పై స్పందిస్తూ.. ఐక్యరాజ్యసమితిలో భారత శాశ్వత మిషన్‌లో మొదటి కార్యదర్శి పీటల్ గెహ్లాట్, పాక్ ప్రధాని భారత్‌తో శాంతి గురించి మాట్లాడారని అన్నారు. ఆయ‌న‌ నిజంగా సత్యవంతుడైతే మార్గం స్పష్టంగా ఉంది. పాకిస్తాన్ వెంటనే అన్ని ఉగ్రవాద శిబిరాలను మూసివేసి, భారత్‌కు వాంటెడ్‌గా ఉగ్రవాదులను మాకు వెంట‌నే అప్పగించాలన్నారు. ద్వేషం, మతోన్మాదం, అసహనాన్ని విశ్వసించే దేశం ఈ సమావేశంలో విశ్వాసం గురించి బోధించడం కూడా విడ్డూరంగా ఉందని పెటల్ గెహ్లాట్ అన్నారు.

పాకిస్తాన్‌లోని రాజకీయ, బహిరంగ ప్రసంగాలు వారి వాస్తవ స్వభావానికి ద‌గ్గ‌ర‌గా ఉంటాయి. సహజంగానే, వారు అద్దంలో చూసుకోరు. పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ప్రసంగానికి సమాధానం చెప్పే హక్కు భారత్‌కు ఉందని అన్నారు. టెర్రరిజం విషయానికొస్తే.. ఉగ్రవాదులు, వారి స్పాన్సర్ల మధ్య ఎటువంటి భేదం ఉండదని భారత్ స్పష్టం చేసిందని పెటల్ గెహ్లాట్ అన్నారు. భారత్ ఇద్దరికీ జవాబుదారీగా ఉంటుందన్నారు.

దీనితో పాటు, తమ మధ్య పెండింగ్‌లో ఉన్న ఏదైనా సమస్యను ద్వైపాక్షికంగా పరిష్కరించుకుంటామని భారతదేశం-పాకిస్తాన్ చాలా కాలంగా అంగీకరించాయని ఐరాసలో భారత్ స్పష్టం చేసింది. ఈ విషయంలో మూడో పక్షానికి ఆస్కారం లేదని పేర్కొంది.

ఆప‌రేష‌న్ సింధూర్‌పై మాట్లాడుతూ.. అనేక పాకిస్తానీ వైమానిక స్థావరాలను కూల్చ‌డం భారత సైన్యం చేసిన విధ్వంసం అని అన్నారు. ఆ నష్టానికి సంబంధించిన‌ ఫోటోలు స్పష్టంగా, పబ్లిక్‌గా అందుబాటులో ఉన్నాయి. ధ్వంసమైన రన్‌వేలు, కాలిపోయిన హ్యాంగర్‌లు పాక్‌ ప్రధానమంత్రి పేర్కొన్నట్లు విజయంగా కనిపిస్తే.. పాకిస్తాన్ ఆనందించవచ్చు. నిజమేమిటంటే గతంలో మాదిరిగానే భారత్‌లో అమాయక పౌరులపై తీవ్రవాద దాడులకు పాకిస్థాన్‌దే బాధ్యత.. మా ప్రజలను రక్షించుకునే హక్కును మేము వినియోగించుకున్నామ‌న్నారు.

Next Story