ఇండోనేషియాలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. వెస్ట్ జావా ప్రావిన్సులోని అతిపెద్ద ఆయిల్ రిఫైనరీ.. బలంగన్ రిఫైనరీలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో అయిదుగురు గాయపడ్డారు. అలాగే.. ప్రమాదస్థలానికి దగ్గరగా ఉన్న 950 మంది స్థానికులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
అయితే ఈ ఘటనలో పలువురు మిస్సైనట్లు అధికారులు తెలిపారు. అగ్ని ప్రమాదం జరగడానికి గల కారణాలు తెలియాల్సివుంది. సోమవారం ఉదయం వెస్ట్ జావా ప్రావిన్సులో ఉన్న రిఫైనరీ నుంచి భారీ స్థాయిలో మంటలు ఎగిసిపడ్డాయి. ఆ ప్రాంతాన్ని నల్లటి పొగ కమ్ముకున్నది.
ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ అయిదుగురితో పాటు.. స్వల్పంగా గాయపడ్డ 15 మందికి చికిత్స అందిస్తున్నట్లు స్థానిక డిజాస్టర్ మేనేజ్మెంట్ ఏజెన్సీ పేర్కొన్నది. జకర్తా ప్రాంతానికి మొత్తం బలంగన్ రిఫైనరీ నుంచే ఇంధనం సరఫరా జరుగుతుంది. 1994 నుంచి ఆ రిఫైనరీ పనిచేస్తున్నది.