అమెరికా అధ్యక్ష భవనం వద్ద కారు బీభత్సం
Man rams car into 2 Capitol police; 1 officer, driver killed. అమెరికా రాజధాని వాషింగ్టన్‌లో అధ్యక్ష భవనం వద్ద బారికేడ్లపై ఓ కారు
By Medi Samrat
అమెరికా రాజధాని వాషింగ్టన్‌లో అధ్యక్ష భవనం వద్ద బారికేడ్లపై ఓ కారు దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఓ పోలీసు చనిపోగా.. మరొకరు గాయపడ్డారు. శుక్రవారం మధ్యాహ్నం అధ్యక్ష భవనానికి సమీపంలో ఓ చెక్‌పోస్టు వద్ద పోలీసులు తనిఖీ చేస్తుండగా ఉన్నట్లుండి ఓ కారు ఇద్దరు పోలీసులపైకి దూసుకువెళ్లింది.
ఆ కారు నుంచి దిగిన వ్యక్తి పోలీసు అధికారుల మీద కత్తితో దాడికి ప్రయత్నించాడు. వెంటనే అప్రమత్తమైన అనుమానితుడిపై కాల్పులు జరిపారు. అయితే ఇది తీవ్రవాద దాడి కాకపోవచ్చని అధికారులు అభిప్రాయపడ్డారు.
మధ్యాహ్నం సరిగ్గా ఒంటి గంటకు క్యాపిటల్ బిల్డింగ్‌లో ఉన్న కాంగ్రెస్ ప్రతినిధులకు ఒక మెయిల్ వచ్చింది. దాడి జరిగే ప్రమాదం ఉందని, కిటికీలు, తలుపులకు దూరంగా వెళ్లాలని, ఒకవేళ ఎవరైనా బయట ఉంటే తమ మీద దాడి జరగకుండా జాగ్రత్తపడాలన్నది అందులోని సారాంశం.
సరిగ్గా అదే సమయంలో బ్లూ సెడాన్ కారులో వచ్చిన ఓ వ్యక్తి బారీకేడ్ల దగ్గర నిలబడి ఉన్న ఇద్దరు పోలీసు సిబ్బంది మీదికి కారును పోనిచ్చాడు. కారు దిగి కత్తితో పోలీసుల మీద దాడి చేసే ప్రయత్నం చేశాడు. దీంతో పోలీసులు నిందితుడిని షూట్ చేయాల్సి వచ్చినట్టుగా సమాచారం. ఘటనలో ఇద్దరు పోలీసు అధికారులు గాయపడ్డారు. వీరిలో ఒకరు మరణించారు. మరొకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
కాల్పులకు దిగిన వ్యక్తి నోవాగ్రీన్ అని గుర్తించామని, అతను ఇండియానా స్టేట్‌కు చెందిన వ్యక్తి అని, అంతకు మించి అతని గురించి ఎక్కువ సమాచారం లేదని ఈ కేసు విచారణలో పాల్గొంటున్న ఇద్దరు అధికారులు చెబుతున్నారు. నిందితుడు ఒక డ్రగ్ అడిక్ట్, నిరుద్యోగి అని నేషన్ ఆఫ్ ఇస్లామ్ అనే జాతీయవాద మత సంస్థ పట్ల ఆకర్షితుడని నోవాగ్రీన్ ఫేస్‌బుక్ పేజ్ ద్వారా తెలుసుకొన్నారు. అయితే భద్రతా నిబంధనల ప్రకారం అతని ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లలో ఉన్న సమాచారాన్ని తొలగించారు. కాల్పుల నేపథ్యంలో ఆ ప్రాంతం మొత్తాన్నీ భద్రతా సిబ్బంది దిగ్బంధం చేశారు. దాడిలో మృతి చెందిన పోలీస్ అధికారికి యు ఎస్ ప్రైస్ ప్రెసిడెంట్ కమలా హారీస్ సంతాపం ప్రకటించారు.