అమెరికా విమానంలో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. అమెరికన్ ఎయిర్‌లైన్స్ విమానంలో జరిగిన ఈ ఘటనకు పాల్పడిన న్యూజెర్సీ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. జూలై 18న 26 ఏళ్ల ఎరిక్ నికోలస్ గాప్కో అనే యువకుడు సియాటెల్ నుండి డల్లాస్‌కు 2101 నంబర్ ఫ్లైట్‌లో ప్రయాణిస్తున్నప్పుడు అందరూ షాక్ అయ్యే విధంగా ప్రవర్తించాడు. సదరు వ్యక్తి మహిళా సిబ్బందిని సెక్స్ కోసం అడిగాడు. ఆ వ్యక్తి అక్కడితో ఆగలేదు. విమానం మధ్యలో చాలాసార్లు విమానం తలుపు తెరవడానికి ప్రయత్నించాడు. దీని కారణంగా విమానం అత్యవసర ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది.
ఎరిక్ నికోలస్ అనే వ్యక్తి విమానంలో తన చొక్కా తీసి.. సిబ్బందిని దుర్భాషలాడడం.. సెక్స్ కోసం అడగడం ప్రారంభించాడని US అటార్నీ కార్యాలయం తెలిపింది. దీని తర్వాత అతను విమాన సహాయకుడిపై కూడా దాడి చేశాడు. ఈ వ్యక్తి ఫ్లైట్ ఎక్కడానికి ముందు డ్రగ్స్ తీసుకున్నాడని.. దాని కారణంగా అతను సహనం కోల్పోయాడని నివేదికలు చెబుతున్నాయి. విమానం నుంచి వైరల్ అయిన ఫోటోలలో అతడు నగ్నంగా, అరుస్తూ కనిపించాడు. విమానంలో చాలా గొడవ జరగడంతో విమానాన్ని సాల్ట్ లేక్ సిటీ వైపు మళ్లించి అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు. అనంతరం పోలీసులు సాల్ట్ లేక్ సిటీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.