ప్లీజ్ మా దేశానికి రండి.. భారతీయులను వేడుకుంటూ ఉన్నారు

భారత్-మాల్దీవుల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు దెబ్బతిన్న సంగతి తెలిసిందే. దీంతో చాలా మంది భారతీయులు మాల్దీవులకు వెళ్లాలని అనుకోవడం లేదు

By Medi Samrat  Published on  7 May 2024 12:00 PM IST
ప్లీజ్ మా దేశానికి రండి.. భారతీయులను వేడుకుంటూ ఉన్నారు

భారత్-మాల్దీవుల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు దెబ్బతిన్న సంగతి తెలిసిందే. దీంతో చాలా మంది భారతీయులు మాల్దీవులకు వెళ్లాలని అనుకోవడం లేదు. మాల్దీవులను సందర్శించే భారతీయ పర్యాటకుల సంఖ్య తగ్గుముఖం పట్టడంతో.. పర్యాటకంపై ఆధారపడిన దేశ ఆర్థిక వ్యవస్థకు సహకరించాలని మాల్దీవుల పర్యాటక మంత్రి సోమవారం భారతీయులను కోరారు.

PTI కి ఇచ్చిన ఇంటర్వ్యూలో, మాల్దీవుల పర్యాటక మంత్రి ఇబ్రహీం ఫైసల్ తన దేశం, భారతదేశం మధ్య ఉన్న చారిత్రక సంబంధాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. “మాకు ఒక చరిత్ర ఉంది. కొత్తగా ఎన్నికైన మా ప్రభుత్వం కూడా భారత్ తో కలిసి పనిచేయాలని కోరుకుంటోంది. మేము ఎల్లప్పుడూ శాంతి, స్నేహపూర్వక వాతావరణాన్ని ప్రోత్సహిస్తాము. భారత ప్రజల రాకపోకలకు మా దేశ ప్రజలు, ప్రభుత్వం ఘన స్వాగతం పలుకుతుంది. దయచేసి మాల్దీవుల టూరిజంలో భాగం కావాలని పర్యాటక మంత్రిగా నేను భారతీయులకు చెప్పాలనుకుంటున్నాను. మా దేశ ఆర్థిక వ్యవస్థ టూరిజంపై ఆధారపడి ఉంది" అంటూ చెప్పుకొచ్చారు. భారతదేశం పశ్చిమ తీరంలోని లక్షద్వీప్ దీవుల ఫోటోలు, వీడియోను జనవరి 6న ప్రధాని నరేంద్ర మోదీ తన X హ్యాండిల్‌లో పోస్ట్ చేసిన తర్వాత ముగ్గురు మాల్దీవుల అధికారులు సోషల్ మీడియాలో భారతదేశం, ప్రధాని నరేంద్ర మోడీపై అవమానకరమైన వ్యాఖ్యలు చేశారు. దీంతో బాయ్ కాట్ మాల్దీవులు అంటూ పెద్ద ఎత్తున ప్రచారం కొనసాగింది. అక్కడికి వెళ్లకూడదని భారతీయులు అనుకోవడంతో మాల్దీవులకు ఊహించని స్థాయిలో ఎదురుదెబ్బ తగిలింది.

Next Story