మాల్దీవుల అధ్యక్షుడు, మొహమ్మద్ ముయిజ్జూ.. భారత ప్రభుత్వానికి మరోసారి కీలక సూచనలు చేశారు. మార్చి 15 లోపు మాల్దీవుల నుండి భారత సైన్యాన్ని ఉపసంహరించుకోవాలని ప్రతిపాదించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీని లక్ష్యంగా చేసుకుని ఇటీవల మాల్దీవుల మంత్రులు చేసిన అవమానకరమైన వ్యాఖ్యలపై ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలు దెబ్బతిన్న నేపథ్యంలో ఆయన ఇప్పుడు ఈ వ్యాఖ్యలు చేశారు. మాల్దీవుల కొత్త అధ్యక్షుడు ముయిజ్జూ.. తమ దేశంలో ఉన్న సైనిక సిబ్బందిని ఉపసంహరించుకోవాలని అధికారికంగా భారతదేశాన్ని అభ్యర్థించారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లక్షద్వీప్ పర్యటనను మాల్దీవుల నాయకులు ఇటీవల ఎగతాళి చేయడంతో భారత్-మాల్దీవులు సంబంధాలు క్షీణించాయి. ఇంటర్నెట్‌లో పలువురు లక్షద్వీప్‌లోని బీచ్‌లను మాల్దీవులతో పోల్చిన తర్వాత మాల్దీవుల మంత్రులు అవమానకరమైన వ్యాఖ్యలు చేశారు. చాలా మంది మాల్దీవులను బహిష్కరించాలని పిలుపునిచ్చారు. అయితే వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ముగ్గురు మంత్రులు మల్షా షరీఫ్, మరియం షియునా, అబ్దుల్లా మహ్జూమ్ మజిద్‌లను ప్రభుత్వం సస్పెండ్ చేసింది.