అమెరికాలో పైప్ లైన్ లీక్ కావడంతో భారీగా చమురు సముద్రం పాలైంది. సముద్రంలో చమురు పెద్ద తెట్టులాగా ఏర్పడడంతో చేపలు, పలు పక్షులకు మృత్యువాతపడ్డాయి. ప్రస్తుతానికి అక్కడ చేపల వేట నిలిపివేయబడింది. ఈ ఘటన లాస్ ఎంజిల్స్‌కు దక్షిణాన 40 మైళ్ల దూరంలోని కాలిఫోర్నియాలోని ఆరెంజ్ కౌంటీలో చోటుచేసుకుంది. కాగా చమురు భారీగా లీక్ కావడం పట్ల పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ సంఘటన పర్యావరణానికి పెద్ద నష్టం అని అధికారులు తెలిపారు. ఫసిఫిక్ మహా సముద్రంలో దాదాపు 18 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో 3,000 బారెల్స్ చమురు లీక్ అయింది. ఈ ఘటనను హంటింగ్టన్ మేయర్ కిమ్ కార్ ధ్రువీకరించారు.
పెద్ద సంఖ్యలో చేపలు, పక్షులు చనిపోయాయని వారు తెలిపారు. కాగా చమురు ప్రభావిత ప్రాంతంలో చేపల వేటను నిలిపివేయాలని కాలిఫోర్నియా డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఫిష్ అండ్ వైల్డ్‌లైఫ్ ఆదేశించింది. యాంప్లిఫై ఎనర్జీ సీఈవో మాట్లాడుతూ.. పైప్‌లైన్ మూసివేశామన్నారు. లీక్ ఎలా జరిగిందో తెలుసుకోవడానికి తాము ప్రయత్నిస్తున్నామన్నారు. ఘటనా స్థలాన్ని స్థానిక సెనేటర్ మిచేల్ స్టీల్ సందర్శించారు. అనంతరం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కు ఈ ఘటనపై లేఖ రాశారు. ఈ సంఘటనను విపత్తుగా ప్రకటించాలని లేఖలో మిచేల్ స్టీల్ పేర్కొన్నారు. ఇదిలా ఉంటే సముద్రంలో చమురు పేరుకుపోయిన ప్రాంతాన్ని అక్కడి సిబ్బంది శుభ్రపరుస్తున్నారు.