Earthquake : చిలీలో భారీ భూకంపం.. తీవ్ర‌త 6.2గా న‌మోదు

ద‌క్షిణ‌ అమెరికా దేశ‌మైన చిలీలో గురువారం రాత్రి భారీ భూకంపం సంభ‌వించింది.రిక్ట‌ర్ స్కేల్ పై దీని తీవ్ర‌త 6.3గా న‌మోదైంది

By తోట‌ వంశీ కుమార్‌  Published on  31 March 2023 10:16 AM IST
Central Chile, Earthquake

ప్ర‌తీకాత్మ‌క చిత్రం

ద‌క్షిణ‌ అమెరికా దేశ‌మైన చిలీలో గురువారం రాత్రి భారీ భూకంపం సంభ‌వించింది. రిక్ట‌ర్ స్కేల్ పై దీని తీవ్ర‌త 6.2గా న‌మోదైంది. గురువారం రాత్రి 11.03 గంట‌ల స‌మ‌యంలో సెంట్ర‌ల్ చిలీలో ప్ర‌కంప‌న‌లు చోటు చేసుకున్నాయి. భూమికి 10 కిలోమీట‌ర్ల లోతులో క‌ద‌లిక‌లు చోటు చేసుకున్నాయ‌ని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ (ఎన్‌సిఎస్) తెలిపింది. ఈ ప్ర‌కంప‌న‌ల కార‌ణంగా ఇప్ప‌టి వ‌ర‌కు ఎలాంటి ప్రాణ‌, ఆస్తి న‌ష్టం వాటిల్లిన‌ట్లు స‌మాచారం అంద‌లేద‌ని అధికారులు తెలిపారు. అయితే.. భూకంపం ప్రభావంతో చిలీ తీర ప్రాంత వాసులు తీవ్ర భయాందోళనలు చెందారు.

ఈ నెల 22న, రిక్టర్ స్కేలుపై 6.3 తీవ్రతతో భూకంపం చిలీలోని ఇక్విక్‌కు ఆగ్నేయంగా 519 కి.మీ దూరంలో సంభవించిందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ (NCS) తెలిపింది. ఇక్విక్ అనేది ఉత్తర చిలీలోని అటకామా ఎడారికి పశ్చిమాన ఉన్న ఒక తీర నగరం. కాగా.. 1960 మే 22న సంబ‌వించిన భూకంప‌మే ఇప్ప‌టి వ‌ర‌కు చిలీలో అతి పెద్ద‌ది. బయో-బయో ప్రాంతంలో 9.5 తీవ్రతతో 10 నిముషాలు భూమి కంపించింది. దీని ప్రభావంతో సముద్రంలో 25 మీటర్ల ఎత్తు వరకు ఎగసిపడిన రాకాసి అలలు దక్షిణ చిలీ, హవాయి, జపాన్‌, ఫిలిప్పీన్స్‌, తూర్పు న్యూజిలాండ్‌, ఆస్ట్రేలియా తీరాలను తాకాయి. భూకంపం, సునామీ ధాటికి 1000 నుంచి 6 వేల మంది మరణించారు.

Next Story