ఇండోనేషియాలో దారుణం.. కొండచరియలు విరిగిపడి 11 మంది మృతి
Landslides in Indonesia leave at least 11 dead.గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతల.కొండచరియలు విరిగిపడి 11 మంది మృతి.
By తోట వంశీ కుమార్ Published on 10 Jan 2021 3:29 PM IST
గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం అవుతోంది. ఈ భారీ వర్షాలకు పలుచోట్ల కొండచరియలు విరిగిపడుతున్నాయి. రెండు చోట్ల రోడ్డు పక్కనున్న కొండచరియలు విరిగిపడి 11 మంది మృత్యువాత పడగా.. 18 మంది తీవ్రంగా గాయపడ్డారు. పెద్ద సంఖ్యలో రాళ్లు విరిగిపడడంతో మరణాల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు.శనివారం మధ్యాహ్నం పశ్చిమ జావాలో సిహంజంగ్ గ్రామంలో కొండచరియలు విరిగిపడ్డాయి. సమాచారం అందుకున్న సహాయక బృందాలు అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
ఈ సమయంలో మరోసారి కొండ చరియలు విరిగిపడ్డాయి. ఈ సారి వంతెన పై పడడంతో.. ఆ గ్రామానికి వెళ్లే దారులు మూసుకుపోయాయి. సహాచక చర్యలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. భారీ యంత్రాలతో శిథిలాలను తొలగిస్తున్నారు. శిథిలాల కింద చిక్కుకున్న వారిని బయటకు తీయడానికి తీవ్రంగా శ్రమిస్తున్నారు. అధిక సంఖ్యలో ప్రజలు కొండ ప్రాంతాలు, నదీ తీర ప్రాంతాల్లో నివసిస్తుండడం వల్ల ఏటా వర్షాకాలంలో ప్రమాదాలకు గురవుతున్నారని అధికారులు తెలిపారు. కాగా.. ఈ ఘటనపై ఇండోనేషియా జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ అధికార ప్రతినిధి రాదిత్య జతీ మాట్లాడారు. భారీ వర్షాలు కురవడంతో మట్టి జారి సిహంజంగ్ వద్ద తొలుత కొండచరియలు విరిగిపడ్డాయన్నారు. కొండచరియలు విరిగిపడిన ప్రదేశంలో అధికారులు సహాయక చర్యలు చేపడుతుండగా.. మరోసారి విరిగిపడ్డాయని తెలిపారు.
ఇండోనేషియాలో కొండచరియలు విరిగిపడటం సర్వసాధారణం. ఎందుకంటే..అక్కడ ప్రజలు అక్రమంగా బంగారు నిక్షేపాల కోసం మైనింగ్ నిర్వహించడం.. అస్థిర నేలలు ఈ పరిస్థితికి దోహదం చేస్తాయి. ఇదిలా ఉంటే.. నిన్న ఇండోనేషియా రాజధాని జకార్తా నుంచి బయలుదేరిన శ్రీవిజయ ఎయిర్ లైన్స్ కు చెందిన విమానం ప్రమాదానికి గురై సముద్రంలో పడి 62 మంది మృతి ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ ఘటన జరిగిన రోజే ఈ దారుణం చోటుచేసుకోవడంతో విషాదఛాయలు అలుముకున్నాయి.