ఐదో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్న సోషల్ మీడియా స్టార్

టర్కీకి చెందిన ప్రముఖ టిక్‌టాక్ స్టార్ కుబ్రా ఐకుత్ ఆత్మహత్య చేసుకుంది.

By Medi Samrat  Published on  30 Sept 2024 11:20 AM IST
ఐదో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్న సోషల్ మీడియా స్టార్

టర్కీకి చెందిన ప్రముఖ టిక్‌టాక్ స్టార్ కుబ్రా ఐకుత్ ఆత్మహత్య చేసుకుంది. నివేదికల ప్రకారం.. కుబ్రా అపార్ట్మెంట్ ఐదవ అంతస్తు నుండి దూకి తన జీవితాన్ని ముగించింది. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. కుబ్రా ఐకుత్ అంత్యక్రియలు ఆమె సొంత జిల్లాలోనే నిర్వహించనున్నారు. టిక్‌టాక్ స్టార్ కుబ్రా ఐకుత్ మరణ వార్తతో అభిమానులు షాక్ అయ్యారు. ఇస్తాంబుల్‌లోని సుల్తాన్‌బెలీ జిల్లాలో కుబ్రా మృతదేహం లభ్యమైనట్లు టర్కీ మీడియా పేర్కొంది. మృతదేహం దగ్గర సూసైడ్ నోట్ కూడా పోలీసులకు దొరికింది. ఈ విష‌య‌మై అధికారులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.

'వరుడు లేకుండా పెళ్లి' అనే వైరల్ వీడియో కారణంగా 26 ఏళ్ల కుబ్రా ఐకుత్ 2023 సంవత్సరంలో సోషల్ మీడియాలో చాలా గుర్తింపు పొందింది. ఈ వీడియోలో కుబ్రా తనను తాను పెళ్లి చేసుకుంది. తనకు తగిన వరుడు దొరకలేదని.. ఈ కారణంగా తనను తాను వివాహం చేసుకోవలసి వచ్చిందని కుబ్రా తెలిపింది. ఆ వీడియో అప్ప‌ట్లో చాలా వైర‌ల్ అయ్యింది. ఇప్పుడు కుబ్రా మరణవార్త తెలియగానే ఆమె అభిమానుల్లో విషాద ఛాయలు అలముకున్నాయి. తన చివరి టిక్‌టాక్ వీడియోలో కుబ్రా తన అపార్ట్‌మెంట్‌ను శుభ్రం చేసింది.

టర్కీ టుడే కథనం ప్రకారం.. మంచి వ్యక్తిగా జీవించడం వల్ల నేను ఏమీ పొందలేదని సూసైడ్ నోట్‌లో కుబ్రా ఐకుత్ రాసింది. జీవితంలో స్వార్థపూరితంగా ఉండండి.. ఇది మాత్రమే మిమ్మల్ని సంతోషపరుస్తుంది. చాలా రోజులుగా కష్టపడుతున్నాను. కానీ ఎవరూ పట్టించుకోలేదు. నన్ను నేను ప్రేమిస్తున్నాను.. కాబట్టి నేను బయలుదేరుతున్నాను. నేను నా ఇష్టానుసారం జంప్ చేసాను. నాకు ఇక బ్రతకాలని లేదు. నా జీవితంలో అందరితో మంచిగా ఉండేదాన్ని. కానీ నాకు నేను మంచిగా ఉండలేకపోయాను.. ఫిస్టిక్‌ను బాగా చూసుకోండి. నన్ను క్షమించు అని సూసైడ్ నోట్ రాసింది.

Next Story