మళ్లీ నేపాల్ పీఎం కేపీ శర్మ ఓలీనే..
KP Sharma Oli sworn in as Prime Minister of Nepal. నేపాల్ ప్రధానిగా మరోసారి కేపీ శర్మ ఓలికే అదృష్టం వరించింది. ప్రభుత్వ ఏర్పాటులో
By Medi Samrat Published on 14 May 2021 8:10 PM ISTనేపాల్ ప్రధానిగా మరోసారి కేపీ శర్మ ఓలికే అదృష్టం వరించింది. ప్రభుత్వ ఏర్పాటులో ప్రతిపక్షాలు విఫలమయ్యాయి. నేపాల్ పార్లమెంటులో గత సోమవారం ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంలో ఓలి ఓటమి పాలయ్యారు. దీంతో ప్రధాని పదవి నుంచి తప్పుకున్నారు. ఓలిని గద్దె దించిన ప్రతిపక్షాలు సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటులో విఫలమవ్వడంతో తిరిగి కేపీ శర్మ ఓలీ ప్రధాని పదవిలో కొనసాగనున్నారు. 271 స్థానాలున్న పార్లమెంటులో ఓలి సారథ్యంలోని నేపాల్ కమ్యూనిస్టు పార్టీ (ఎన్సీపీ) కి 121 మంది సభ్యులున్నారు. ప్రధాన ప్రతిపక్షమైన నేపాలీ కాంగ్రెస్ అధినేత షేర్ బహదూర్ దేవ్ వా నివాసంలో నిన్న సమావేశమైన నేతలు.. ప్రతిపక్ష జనతా సమాజ్‌వాదీ పార్టీ మద్దతు తమకు లభించే అవకాశం లేదని క్లారిటీ తెచ్చుకోవడంతో ప్రభుత్వ ఏర్పాటు సాధ్యం కాదని నిర్ణయించారు. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ నేపాల్ (మావోయిస్టు సెంటర్) కూడా ఇదే మాట చెప్పడంతో.. అతి పెద్ద పార్టీగా ఉన్న ఎన్సీపీ చీఫ్ అయిన కేపీ శర్మ ఓలిని ప్రభుత్వ ఏర్పాటుకు అధ్యక్షురాలు విద్యాదేవి భండారీ ఆహ్వానించారు.
275 మంది సభ్యులున్న నేపాల్ ప్రతినిధుల సభలో ఓలీ ప్రభుత్వం కొద్దిరోజుల కిందట విశ్వాసపరీక్షను ఎదుర్కోవాల్సి వచ్చింది. ఈ పరీక్షలో ఓలీకి మద్దతుగా 93 ఓట్లు రాగా, వ్యతిరేకంగా 124 ఓట్లు పడ్డాయి. మరో 15 మంది తటస్థంగా ఉన్నారు. నేపాల్ రాజ్యాంగం ప్రకారం ఓలీ తన ప్రధాని పదవిని కోల్పోయారు.ఆ తర్వాత నేపాల్ కాంగ్రెస్ అధ్యక్షుడు షేర్ బహదూర్ దేవ్ బా, నేపాల్ కమ్యూనిస్టు పార్టీ ఛైర్మన్ ప్రచండ, జనతా సమాజ్ వాదీ పార్టీ నేత ఉపేంద్ర యాదవ్ లు కలిసి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చారు. తమకు ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం కల్పించాలని నేపాల్ అధ్యక్షురాలైన బింద్యాదేవి భండారిని కోరారు. నేపాల్ కాంగ్రెస్ అధ్యక్షుడు దేవ్ బాకు మద్దతు ఇస్తామని పలికిన జనతా సమాజ్ వాదీ పార్టీ నేతలు దేవ్ బా కాకుండా గతంలో ప్రధాని పదవిని చేపట్టని కొంతవారికి అవకాశం కల్పించాలని కోరారు. 24 గంటల పాటు చర్చలు జరిగిన తర్వాత కూడా ఈ మూడు పార్టీల నేతలు సయోధ్యకు రాకపోవడంతో నేపాల్ రాజ్యాంగాన్ని అనుసరించి అధ్యక్షురాలైన విద్యాదేవి భండారీ సభలో అతిపెద్ద పార్టీ నేతగా ఉన్న కేపీ శర్మ ఓలీనే తిరిగి ప్రధానిగా నియమిస్తూ ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించారు. అదృష్టం అంటే కేపీ శర్మ ఓలీదే అనే కామెంట్లు వినిపిస్తూ ఉన్నాయి.