ప్రపంచ దేశాలు ఏమి మాట్లాడినా పట్టనట్లు వ్యవహరించడం ఉత్తరకొరియా పద్ధతి. ఐరాస ఆంక్షలు విధించినా కూడా తాము మాత్రం క్షిపణి పరీక్షలు ఆపమని చెబుతూనే ఉన్నారు. అమెరికాపై అణ్వస్త్ర దాడులే లక్ష్యంగా అభివృద్ధి చేసిన శక్తిమంతమైన క్షిపణులను కిమ్‌ జాంగ్ ఉన్‌ పరిశీలించారు. అధికార వర్కర్స్‌ పార్టీ 76వ వార్షికోత్సవం సందర్భంగా ప్యాంగ్‌యాంగ్‌లో ఏర్పాటుచేసిన ఆయుధ వ్యవస్థల ప్రదర్శనను ఆయన సందర్శించారు. ఈ ప్రదర్శనలో ఆ క్షిపణులను కూడా ఉంచారు. వాటిని సందర్శించిన అనంతరం కిమ్‌ మాట్లాడుతూ ఉత్తర కొరియాకు అజేయ సైన్యాన్ని నిర్మిస్తానని ప్రతినబూనారు. అమెరికా తప్పుడు నిర్ణయాలు, చర్యలతో ఈ ప్రాంతంలో ఉద్రిక్తతలను సృష్టిస్తూనే ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

తెగ మాట్లాడేస్తున్న కిమ్:

ఇటీవలి కాలంలో ఉత్తర కొరియాలో జరిగిన పలు కార్యక్రమాల్లో కిమ్ తెగ మాట్లాడేస్తూ ఉన్నాడట. ముఖ్యంగా ఎప్పుడూ లేనిది ప్రజల గురించి కూడా తాను ఆలోచిస్తూ ఉన్నానని వ్యాఖ్యలు చేయడం హాట్ టాపిక్ అయింది. ఎందుకంటే ఎప్పుడు చూసినా క్షిపణులు, దాడులు గురించి మాత్రమే మాట్లాడే కిమ్.. ఏకంగా ప్రజల ప్రాణాలను కాపాడాలని అంటున్నాడు. ఇక ప్రజల గురించి ఆలోచించాల్సిన టైం వచ్చిందని ఇటీవల చేసిన ప్రసంగం అధికారులను సైతం విస్మయానికి గురి చేసింది. ఆర్థిక వ్యవస్థ పతనం ఏ స్థాయిలో ఉన్నా సరే.. ప్రజల జీవన ప్రమాణాల్ని మెరుగుపర్చాల్సిన అవసరం ప్రభుత్వం మీద ఉందని అధ్యక్షుడు కిమ్‌ వ్యాఖ్యలు చేశారు. ఆదివారం జరిగిన పార్టీ వార్షిక సమావేశంలోనే ఆయన ఈ వ్యాఖ్యలు చేశాడు. ఆహార-మందుల కొరతను ఎదుర్కొంటున్నారు ఉత్తర కొరియా ప్రజలు. ఆకలి చావులపై ఐరాస మానవ హక్కుల విభాగపు దర్యాప్తు సంస్థ కూడా నిర్ధారించింది. ఈ తరుణంలో ఆర్థిక వ్యవస్థను కాపాడుకోవడం కంటే ప్రజలే ముఖ్యమని కిమ్ వ్యాఖ్యలు చేశారు.


సామ్రాట్

Next Story