భారత్, పాకిస్థాన్ మధ్య ప్రస్తుతం నెలకొన్న తీవ్ర ఉద్రిక్తతలు, ఘర్షణ వాతావరణం సమసిపోవాలంటే భారత్ తన దూకుడును తగ్గించుకోవాలని పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ స్పష్టం చేశారు. బ్లూమ్‌బెర్గ్ వార్తా సంస్థతో మాట్లాడుతూ, భారత్ నుంచి ఎలాంటి దురాక్రమణ ఎదురైనా దానికి ప్రతిస్పందించే హక్కు పాకిస్థాన్‌కు ఉందని ఖవాజా ఆసిఫ్ అన్నారు. ప్రస్తుత ఘర్షణలో ఇస్లామాబాద్ కేవలం భారత దాడులకు ప్రతిస్పందిస్తోందని, తమను దురాక్రమణదారులుగా చూడరాదని అన్నారు. ఈ ఉద్రిక్తతలను ప్రారంభించింది భారత్ అని ఆరోపించారు.
గత రెండు వారాలుగా మేము భారతదేశంపై ఎటువంటి శత్రు చర్య తీసుకోబోమని చెబుతూనే ఉన్నాము. తమపై దాడి జరిగితే మాత్రం తప్పక ప్రతిస్పందిస్తామని ఆసిఫ్ అన్నారు. భారతదేశం వెనక్కి తగ్గాలని ఎంచుకుంటే, ఈ ఉద్రిక్తతను తగ్గించడానికి మేము పూర్తిగా సిద్ధంగా ఉన్నామని అన్నారు. ఈ దశలో రెండు దేశాల మధ్య ఎటువంటి దౌత్యపరమైన ఒప్పందాలు లేదా చర్చలు జరగబోతున్నాయనే దాని గురించి తనకు తెలియదని కూడా ఆసిఫ్ అన్నారు.