అమెరికాలో గాంధీ విగ్రహంపై ఖలిస్థానీ వేర్పాటువాదుల దుశ్చర్య..!
Khalistanis target Mahatma Gandhi’s statue in Washington. భారత్‌లో నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నిరసన
By Medi Samrat Published on 13 Dec 2020 12:36 PM ISTభారత్‌లో నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేస్తున్న రైతులకు మద్దతుగా అమెరికాలో సిక్కు వర్గానికి చెందిన వారు భారీ కార్ల ర్యాలీ నిర్వహించారు. న్యూయార్క్, న్యూజెర్సీ, నార్త్ కరోలినా, పెన్సిల్వేనియా, ఇండియానా, ఒహియో తదితర నగరాల నుంచి ర్యాలీగా రాజధాని వాషింగ్టన్‌లోని భారత ఎంబసీకి చేరుకుని శాంతియుతంగా నిరసన తెలిపాయి. వీరి నిరసనల్ని ఆసరాగా చేసుకున్న ఖలిస్థానీ వేర్పాటువాదులు వారితో కలిసిపోయారు. అనంతరం తమ జెండాతో గాంధీ విగ్రహాన్ని కప్పేసి ధ్వంసం చేయడానికి ప్రయత్నం చేశారు. ఇది గమనించిన సెక్యూరిటీ అధికారులు వారించడంతో వేర్పాటువాదులు అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు సమాచారం.
కాగా.. గాంధీ విగ్రహాన్ని అపవిత్రం చేయడం పట్ల అక్కడి భారత రాయబార కార్యాలయం తీవ్రంగా ఆక్షేపించింది. ఈ విషయాన్ని స్థానిక భద్రతా వ్యవస్థ దృష్టికి తీసుకెళ్లింది. దీనికి కారణమైన వారిని తప్పకుండా శిక్షించడం జరుగుతుందని రాయబార కార్యాలయం అధికారులు పేర్కొన్నారు. ఇప్పటికే ఈ దుశ్చర్యకు సంబంధించిన వివరాలను అమెరికా విదేశాంగ శాఖకు తెలియజేశామని, సాధ్యమైనంత త్వరగా దోషుల్ని కోర్టు ముందకు తీసుకురావాలని కోరినట్లు చెప్పారు.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ జూన్‌లో తెచ్చిన కొత్త చట్టం ప్రకారం అమెరికాలో ఉన్న విగ్రహాలు, మెమోరియళ్ల ధ్వంసం, అపవిత్రం చేయడం, కూల్చడం వంటి దుశ్చర్యలకు పాల్పడితే నేరంగా పరిగణిస్తారు. దోషిగా తేలితే 10 ఏళ్ల పాటు జైలు శిక్ష విధిస్తారు.