మాట్లాడుకుందాం రండి..ఉక్రెయిన్ ప్రెసిడెంట్‌కు రష్యా ఆహ్వానం
రష్యా, ఉక్రెయిన్ యుద్ధంలో కీలక పరిణామం చోటుచేసుకుంది
By - Knakam Karthik |
మాట్లాడుకుందాం రండి..ఉక్రెయిన్ ప్రెసిడెంట్‌కు రష్యా ఆహ్వానం
రష్యా, ఉక్రెయిన్ యుద్ధంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. దాదాపు నాలుగేళ్లుగా సాగుతున్న రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు పలికేందుకు అంతర్జాతీయ వేదికలపై దౌత్య ప్రయత్నాలు తుది దశకు చేరుకున్నాయి. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీని శాంతి చర్చలకు మాస్కో రావాలని రష్యా ఆహ్వానించింది. అయితే ఈ విషయంపై ఆయన నుంచి ఇంకా స్పందన రాలేదని క్రెమ్లిన్ ప్రతినిధి దిమిత్రీ పెస్కోవ్ తెలిపారు. గతేడాది రష్యా పంపిన ఆహ్వానాన్ని జెలెన్‌స్కీ తిరస్కరించారు. తన దేశంపై మిసైళ్లు ప్రయోగిస్తున్న దేశానికి తాను వెళ్లబోనని స్పష్టం చేశారు.
అయితే, జెలెన్‌స్కీ గతంలోనే ఇలాంటి ఆహ్వానాన్ని తిరస్కరించారు. ప్రతిరోజూ క్షిపణి దాడులు చేస్తున్న దేశ రాజధానికి తాను వెళ్లలేనని, చర్చలు జరగాలంటే పుతిన్ 'కీవ్'కు రావాలని డిమాండ్ చేశారు. తాజా ఆహ్వానంపై ఉక్రెయిన్ ఇంకా అధికారికంగా స్పందించలేదు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ యుద్ధాన్ని ముగించడమే లక్ష్యంగా చేపట్టిన దౌత్యవేత్తల చర్చలు అబుదాబిలో సాగుతున్నాయి. గత వారాంతంలో జరిగిన మొదటి రౌండ్ చర్చలు 'నిర్మాణాత్మకంగా' సాగాయని, ఫిబ్రవరి 1వ తేదీన రెండో రౌండ్ చర్చలు జరగనున్నాయని అధికారులు తెలిపారు. "చాలా మంచి పరిణామాలు జరుగుతున్నాయి" అని ఈ చర్చల పురోగతిపై ట్రంప్ స్వయంగా ట్వీట్ చేయడం విశేషం.
ఉక్రెయిన్‌లో ప్రస్తుతం మైనస్ డిగ్రీల చలి తీవ్రంగా ఉంది. ఈ పరిస్థితుల్లో లక్షలాది మంది ప్రజలు అంధకారంలో మగ్గిపోవడంతో, మానవతా దృక్పథంతో విద్యుత్ గ్రిడ్లపై దాడులు ఆపాలని ట్రంప్ చేసిన విజ్ఞప్తికి రష్యా సూత్రప్రాయంగా అంగీకరించినట్లు తెలుస్తోంది. దీనిపై రష్యా నేరుగా స్పందించనప్పటికీ, వారం రోజుల పాటు 'హ్యుమానిటేరియన్ పాజ్' (మానవతా విరామం) ఇచ్చే అవకాశం ఉందని వైట్ హౌస్ వర్గాలు వెల్లడించాయి.