మోడీని అన్నా అని పిలిచిన మ‌హిళ అనుమానాస్ప‌ద స్థితిలో మృతి.. పాక్‌పై అనుమానం

Karima Baloch found dead in Canada's Toronto. బ‌లోచిస్తాన్ ఉద్య‌మంలో కీల‌క పాత్ర పోషించిన క‌రీమా బ‌లోచ్ కెనాడాలోని

By Medi Samrat  Published on  23 Dec 2020 4:50 AM GMT
మోడీని అన్నా అని పిలిచిన మ‌హిళ అనుమానాస్ప‌ద స్థితిలో మృతి.. పాక్‌పై అనుమానం

బ‌లోచిస్తాన్ ఉద్య‌మంలో కీల‌క పాత్ర పోషించిన క‌రీమా బ‌లోచ్ కెనాడాలోని టొరంటోలో అనుమానాస్ప‌ద స్థితిలో మృతి చెందారు. ఆమె క‌నిపించ‌కుండా పోయిన ఒక రోజు త‌ర్వాత క‌రీమా మృత‌దేహాన్ని పోలీసులు గుర్తించారు. పాకిస్థాన్ సైన్యం, బ‌లూచిస్థాన్ ప్ర‌భుత్వ దురాగ‌తాల‌కు వ్య‌తిరేకంగా ఆమె పోరాడుతుంది. 2016లో పాకిస్థాన్ నుంచి త‌ప్పించుకుని వెళ్లిన క‌రీమా ప్ర‌స్తుతం కెన‌డాలో శ‌ర‌ణార్థిగా ఆశ్ర‌యం పొందుతోంది.

నాలుగేళ్ల కింద‌ట ర‌క్షాబంధ‌న్ నాడు(2016)లో భార‌త ప్ర‌ధాని న‌రేంద్ర మోదీని సాయం కోరుతూ పంపిన వీడియోతో క‌రీమా ప్ర‌ముఖంగా వార్త‌ల్లో నిలిరు. ఆ వీడియోలో ఏం ఉందంటే.. భార‌త ప్ర‌ధాని న‌రేంద్ర మోడీని సోద‌రుడిగా భావిస్తున్నామ‌ని.. సాయం చేయాల‌ని అడిగారు. అంత‌ర్జాతీయ వేదిక‌ల‌పై బ‌లోచిస్తాన్ ఉద్య‌మానికి గొంతుక‌గా నిల‌వాల‌న్నారు. మా సొంతంగా మేము పోరాటాన్ని చేస్తాం. నువ్వు కేవ‌లం మా ఆవేద‌న‌ను ప్ర‌పంచానికి తెలియ‌జెయ్యి అంటూ ఆ వీడియోలో క‌రీమా కోరారు.

కాగా.. నేడు ఆమె మృత‌దేహాన్ని టొరేంటో న‌గ‌రానికి స‌మీపంలో క‌నుగొన్నారు. ఆమె మృతితో 40 రోజుల పాటు సంతాప దినాలు పాటించాల‌ని బ‌లోచ్ నేష‌న‌ల్ మూవ్‌మెంట్ పిలుపునిచ్చింది. ఈ హ‌త్య వెనుక పాక్ నిఘా సంస్థ ఐఎన్ఐ హ‌స్తం ఉంద‌న్న ఆరోప‌ణ‌లు ఉన్నాయి. ఈ ఏడాది విదేశాల్లో మ‌ర‌ణించిన రెండో బలోచిస్తాన్ ఉద్య‌మ‌కారిణి క‌రీమా బ‌లోచ్‌. ఈ ఏడాది ఏప్రిల్‌లో బ‌లోచిస్తాన్ జ‌ర్న‌లిస్ట్ సాజిద్ హుస్సేన్ బ‌లోచ్ మృత‌దేశాన్ని స్వీడ‌న్‌లోని ఉప్‌స‌లాలో గుర్తించారు. అంత‌కు కొన్ని వారాల ముందు నుంచీ అత‌డు క‌నిపించ‌కుండా పోయాడు.

బీబీసీ 2016లో ప్ర‌చురించిన 100 మంది స్ఫూర్తిదాయ‌క మ‌హిళ‌ల జాబితాలో చోటు సంపాదించిన క‌రీమా.. అదే ఏడాది పాకిస్థాన్‌లో త‌న‌కు ప్రాణ‌హాని ఉందంటూ కెన‌డాలో ఆశ్ర‌యం కోరారు. బ‌లోచిస్తాన్ స్వాతంత్ర్యం కోసం పోరాడిన ఆమె.. 2014లో స్విట్జ‌ర్లాండ్‌లో జ‌రిగిన ఐక్య‌రాజ్య స‌మితి స‌మావేశంలో ఈ అంశాన్ని లేవ‌నెత్తారు. అదే ఏడాది బ‌లూచిస్తాన్ స్టూడెంట్ ఆర్గ‌నైజేష‌న్ - ఆజాద్‌కు తొలి మ‌హిళా చైర్‌ప‌ర్స‌న్‌గా నిలిచారు. ఆమె చివ‌రి ట్వీట్ కూడా ఉద్యమం గురించే చేశారు. డిసెంబ‌ర్ 14న చివ‌రి సారి ట్వీట్ చేశారు. బ‌లోచ్ ఉద్య‌మ‌కారుల‌ను రక్షించాల‌ని కోరారు. పాక్‌సైన్యం త‌మ వారిని కిడ్నాప్, హ‌త్య‌లు చేస్తోంద‌ని పేర్కొంది.


Next Story