ఆఫ్ఘనిస్తాన్ లో దారుణమైన పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే..! ఆఫ్ఘన్ లో సంక్షోభానికి అమెరికానే కారణమని చెబుతూ ఉన్నారు. ఇలాంటి సమయంలో అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ ఆసియా పర్యటనకు విచ్చేసారు. ఈ రోజు నుంచి ఆమె ఆసియా దేశాల్లో పర్యటనలో భాగంగా సింగపూర్, వియత్నాంలలో కమలా హ్యారిస్ పర్యటన సాగనుంది. సోమవారం సింగపూర్ నాయకత్వాన్ని ఆమె కలవడం ద్వారా అధికారికంగా పర్యటన ప్రారంభం కానుంది. ప్రస్తుత ఆఫ్ఘన్ సంక్షోభాన్ని 1975 నాటి సైగాన్ ఘటనతో విశ్లేషకులు పోల్చిచూస్తున్నారు. యూఎస్ హెలికాఫ్టర్లు నాడు ఎంబసీ పైకప్పు నుంచి దౌత్య వేత్తలు, పౌరులను తరలించిన విషయాన్ని అనేక మంది గుర్తుచేస్తున్నారు.
ఆఫ్ఘన్‌లో అమెరికా పరాజయానికి ముందే కమలా హారిస్ పర్యటన ఖరారైందనని యూఎస్ అధికారులు చెప్పారు. ఆసియాలో వాషింగ్టన్ విస్తృత వ్యూహాత్మక లక్ష్యాలపై ఆమె దృష్టి పెట్టినట్లు వారు తెలిపారు. అమెరికా నుంచి ఎయిర్ ఫోర్స్ విమానంలో బయలుదేరిన కమలా హ్యారిస్ సింగపూర్‌కు చేరుకున్నారు. ఆసియా ఉపఖండంలో శాంతిభద్రతలను పరిరక్షించడానికి తాము కట్టుబడి ఉన్నామని, వాటిని పర్యవేక్షించడానికే కమలా హ్యారిస్ పర్యటన ఉద్దేశ్యమని అమెరికా విదేశాంగ మంత్రిత్వ శాఖ ఆసియా విభాగం తెలిపింది.