మందుపాత‌ర పేల్చి డిప్యూటీ గ‌వ‌ర్న‌ర్ హ‌త్య‌

Kabul deputy governor killed in 'sticky bomb' attack on car. ఆప్ఘ‌నిస్థాన్ రాజ‌ధాని కాబూల్‌లో ఉగ్ర‌వాదుల దారుణాలు కొనసాగుతున్నాయి.

By Medi Samrat  Published on  16 Dec 2020 7:26 AM GMT
మందుపాత‌ర పేల్చి డిప్యూటీ గ‌వ‌ర్న‌ర్ హ‌త్య‌

ఆప్ఘ‌నిస్థాన్ రాజ‌ధాని కాబూల్‌లో ఉగ్ర‌వాదుల దారుణాలు కొనసాగుతున్నాయి. కాబూల్ లో మందుపాత‌ర పేల్చి కాబూల్ డిప్యూటీ గ‌వ‌ర్న‌ర్ మొహిబుల్లా మొహ‌మ్మ‌దిని హ‌త‌మార్చారు. ఆయన ప్రయాణిస్తున్న కారుకు గుర్తు తెలియని వ్యక్తులు ఐఈడీ బాంబును అమర్చి.. దాన్ని పేల్చారు. ఈ ప్రమాదంలో ఆయన సహచరుడు కూడా మరణించారు. మరో ఇద్దరు గాయపడ్డారు. తన సెక్యూరిటీ గార్డులతో కలిసి ఆయన విధుల నిమిత్తం వెళుతున్న వేళ ఈ ఘటన జరిగింది. ఆయన్ను హత్య చేసింది తామేనని ఇంతవరకూ ఏ ఉగ్రవాద సంస్థ‌ ప్రకటించలేదు. కాబూల్‌లోని పీడీ9 జిల్లా మాక్రోర్యాన్ 4 ఏరియాలో ఈ ఘ‌ట‌న జ‌రిగింద‌ని ఆఫ్ఘ‌నిస్థాన్‌కు చెందిన టోలో న్యూస్ సంస్థ వెల్ల‌డించింది.

ఇదిలావుంటే కాబూల్‌లో ఈ తెల్ల‌వారు జామున కూడా ఉగ్ర‌వాదులు దాడికి పాల్ప‌డ్డారు. ఈ దాడిలో ఒక పోలీస్ ప్రాణాలు కోల్పోగా, మ‌రో ఇద్ద‌రు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. ఈ రెండు ఘటనలపై దర్యాప్తు కొనసాగుతోందని కాబూల్ పోలీసు చీఫ్ ప్రతినిధి ఫెర్డాస్ ఫరామార్జ్ అన్నారు. అయితే ఈ దాడుల వెనుక ఇస్లామిక్‌ స్టేట్‌ హస్తం ఉందని అనుమానిస్తున్నారు. గత కొద్ది నెలలుగా ఐసిస్‌ దాడుల్లో సుమారు 50 మంది మరణించారు.

ఆఫ్గన్ ప్రభుత్వం, తాలిబాన్ల మధ్య శాంతి చర్చలు ప్రారంభమైన తరువాత దేశవ్యాప్తంగా హింసాత్మక ఘటనలు జరుగుతున్నాయి. ముఖ్యంగా కాబూల్ పరిధిలో పలువురు జర్నలిస్టులు, రాజకీయ నాయకులు, హక్కుల కార్యకర్తలు, మత పెద్దలు లక్ష్యంగా దాడులు జరుగుతున్నాయి. గత వారం జలాలాబాద్ లో ఓ మహిళా న్యూస్ యాంకర్ ను కాల్చి చంపారు.
Next Story