గ్రీన్ కార్డు హోల్డర్స్‌కు షాకింగ్ న్యూస్
అమెరికా ఉపాధ్యక్షుడు జెడి వాన్స్ సరికొత్త వివాదానికి కేరాఫ్ గా నిలిచారు.
By Medi Samrat Published on 14 March 2025 7:00 PM IST
అమెరికా ఉపాధ్యక్షుడు జెడి వాన్స్ సరికొత్త వివాదానికి కేరాఫ్ గా నిలిచారు. గ్రీన్ కార్డ్ వలసదారులకు దేశంలో శాశ్వతంగా ఉండే హక్కును ఇవ్వదని అన్నారు. కొలంబియా యూనివర్సిటీ గ్రాడ్యుయేట్ విద్యార్థి, గ్రీన్ కార్డ్ హోల్డర్ అయిన మహమూద్ ఖలీల్ అరెస్టుకు ప్రతిస్పందనగా వాన్స్ ఈ వ్యాఖ్యలు చేశారు.
అధికారికంగా శాశ్వత నివాసి కార్డుగా పిలువబడే గ్రీన్ కార్డ్, భారతీయులతో సహా విదేశీ పౌరులు USలో నివసించడానికి, పని చేయడానికి అనుమతిస్తుంది. "గ్రీన్ కార్డ్ హోల్డర్‌కు అమెరికాలో ఉండటానికి నిరవధిక హక్కు లేదు" అని ఫాక్స్ న్యూస్ 'ది ఇంగ్రాహం యాంగిల్' కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వాన్స్ అన్నారు. ఇది జాతీయ భద్రతకు సంబంధించినది, అయితే అమెరికన్ ప్రజలుగా మనం మన సమాజంలో ఎవరిని చేర్చుకోవాలని నిర్ణయించుకుంటామనే దాని గురించి కూడా ఆలోచించాల్సి ఉంటుందని ఆయన అన్నారు.
ఫిబ్రవరి 27న అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతూ.. ప్రతిపాదిత 'గోల్డ్ కార్డ్' కొనుగోలు చేసేవారికి పౌరసత్వం పొందే మార్గంతో వస్తుందని, దీని ధర తాత్కాలికంగా $5 మిలియన్లు ఉంటుందని అన్నారు. ఓ వైపు గోల్డ్ కార్డు గురించి చర్చ జరుగుతూ ఉండగా.. గ్రీన్ కార్డ్ హోల్డర్స్ విషయంలో వాన్స్ చేసిన వ్యాఖ్యలు ఎంతో మందికి టెన్షన్ తెప్పిస్తున్నాయి.