ప్రధాని ప్రసంగిస్తుండ‌గా పేలుడు.. పోలీసుల అదుపులో ఎటాక్ కు పాల్ప‌డిన వ్య‌క్తి

Japan PM Unhurt After Blast During His Speech, Attacker Caught. జపాన్ ప్రధాని ప్రసంగిస్తున్న సమయంలో పేలుడు సంభవించింది. అయితే, ప్రధానిని అక్కడి నుంచి సురక్షితంగా తరలించారు.

By Medi Samrat  Published on  15 April 2023 9:30 AM IST
ప్రధాని ప్రసంగిస్తుండ‌గా పేలుడు.. పోలీసుల అదుపులో ఎటాక్ కు పాల్ప‌డిన వ్య‌క్తి

జపాన్ ప్రధాని ప్రసంగిస్తున్న సమయంలో పేలుడు సంభవించింది. అయితే, ప్రధానిని అక్కడి నుంచి సురక్షితంగా తరలించారు. జపాన్ టైమ్స్ ప్రకారం.. జపాన్ ప్రధాని ఫుమియో కిషిడా శనివారం వాకయామా నగరంలో ప్ర‌సంగిస్తుండ‌గా.. భారీ పేలుడు సంభవించింది. ప్ర‌ధానిపై స్మోక్ బాంబ్ లేదా పైప్ బాంబు విసిరారని అనుమానం వ్య‌క్తం చేస్తున్నారు. పేలుడు జరిగిన వెంట‌నే ఘ‌ట‌నాస్థ‌లంలో ఉన్న‌ ప్రజలు ఆశ్రయం పొందేందుకు పరుగులు తీశారు. ఈ కేసులో పోలీసులు ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ప్రమాదం నుంచి ప్ర‌ధాని కిషిదా తృటిలో బయటపడ్డారు. జపాన్ టైమ్స్ ప్రకారం.. ప్ర‌ధాని అధికార లిబరల్ డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థికి మద్దతుగా ప్రసంగం చేయాల్సివుంది.

ఈ పేలుడుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేసింది. ఇందులో స్పీచ్ వేదిక వద్ద పెద్ద సంఖ్యలో జనం, చేతిలో కెమెరాలతో మీడియా ప్రతినిధులు ఉండడం, పెద్ద ఎత్తున పేలుడు శబ్ధం రావడంతో కేకలు వేస్తూ పరుగు పరుగున ప్రాణాలను కాపాడుకునే ప్రయత్నం చేయడం స్పష్టంగా వినిపిస్తోంది.

ప్రధానిపై దాడి చేయడమే లక్ష్యంగా జపాన్‌లో ఇలాంటి ప్ర‌య‌త్నం జ‌ర‌గ‌డం ఇదే తొలిసారి కాదు. ఇంతకు ముందు కూడా.. జపాన్ మాజీ ప్రధాని షింజో అబే ప్రసంగిస్తున్నప్పుడు ఇటువంటి సంఘటన జరిగింది. దుండగుడు ఆయ‌న‌పై కాల్పులు జరిపాడు. దాడి తరువాత ఆయ‌న‌ను ఆసుపత్రికి తీసుకెళ్లగా.. అప్ప‌టికే మ‌ర‌ణించారు.


Next Story