పలువురు ప్రముఖులు పొలిటికల్ పార్టీలలోకి వెళుతూ ఉండడం సర్వసాధారణం. ప్రముఖ సినీ నటుడు జాకీ చాన్ కూడా పాలిటిక్స్ విషయంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అధికార కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ చైనా(సీపీసీ)లో చేరడానికి ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. ఇటీవల చైనా సినీ ప్రముఖుల మధ్య జరిగిన ఓ చర్చా కార్యక్రమంలో జాకీ చాన్ తన మనసులోని మాట బయటపెట్టారని ఆ దేశ అధికారిక పత్రిక గ్లోబల్ టైమ్స్ తెలిపింది. సీపీసీ శతాబ్ది వేడుకలు ఘనంగా నిర్వహించారు. చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ కూడా ఈ కార్యక్రమంలో మాట్లాడారు.
జాకీ చాన్ మాట్లాడుతూ సీపీసీ విధానాలను ప్రశంసించారు. అక్కడితో ఆగని జాకీ చాన్ నేను ఆ పార్టీ సభ్యుణ్ని కావాలనుకుంటున్నానని వెల్లడించారు. చైనా ఫిలిం అసోసియేషన్ ఉపాధ్యక్షుడైన జాకీ చాన్ వ్యాఖ్యలు ప్రస్తుతం ప్రాధాన్యత సంతరించుకుంది. హాంకాంగ్‌లో నివసిస్తున్న 67 ఏళ్ల జాకీ చాన్ ముందు నుంచీ సీపీసీకి మద్దతు పలుకుతున్నారు. హాంకాంగ్‌లో ప్రజాస్వామ్యవాదుల నిరసనను అణచివేయడానికి సీపీసీ చేపట్టిన చర్యలనూ ఆయన సమర్థించారు.