ఇజ్రాయెల్ దేశంలో శనివారం నుంచి అధికారికంగా కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రారంభమైంది. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు కరోనా టీకా వేయించుకున్నారు. వ్యాక్సిన్ తీసుకున్న తొలి ఇజ్రాయెల్ వాసి నెతన్యాహుయే కావడం విశేషం. ఫైజర్-బయోఎన్‌టెక్ అభివృద్ధి చేసిన టీకా డోసులు నాలుగు మిలియన్లు ఇజ్రాయెల్ ప్రభుత్వానికి అందాయి. వీటితో దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రధానే స్వయంగా తొలి టీకా వేయించుకొని.. వ్యాక్సిన్‌పై ప్రజల్లో ఉన్న భయాందోళనలను దూరం చేశారు. ప్రతి ఒక్కరూ టీకా తీసుకోవాలని పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా నెతన్యాహు మాట్లాడుతూ.. చిన్న ఇంజెక్షన్ ద్వారా ఎంతోమంది ఆరోగ్యాలను రక్షించవచ్చన్నారు. దీనిని పెద్ద ముందడుగుగా అభివర్ణించారు. ప్రతి ఒక్కరు వ్యాక్సిన్ వేయించుకోవాలని పిలుపునిచ్చారు. ఇదిలా ఉంటే.. ఇజ్రాయెల్‌లో ఇప్పటి వరకు 3.72లక్షల కొవిడ్ కేసులు నమోదయ్యాయి. వీరిలో 3,070 మంది ప్రాణాలు కోల్పోయారు. అమెరికా, రష్యా, బ్రిటన్ లలో ఇప్పటికే వ్యాక్సినేషన్ ప్రారంభమైన విషయం తెలిసిందే.