ఇజ్రాయెల్ కు సాయం చేస్తున్న రాబంధులు
ఇజ్రాయెల్ సైన్యానికి డేగలు, రాబంధులు సహాయం చేస్తున్నాయి.
By Medi Samrat Published on 10 Nov 2023 7:15 PM ISTఇజ్రాయెల్ సైన్యానికి డేగలు, రాబంధులు సహాయం చేస్తున్నాయి. అక్టోబర్ 7న హమాస్ తీవ్రవాద సంస్థ జరిపిన దాడిలో ప్రాణాలు కోల్పోయిన వారి మృతదేహాలను గుర్తించేందుకు ఇజ్రాయెల్ సైన్యం పక్షులను ఉపయోగించాల్సి వస్తోంది. హమాస్ ఉగ్రవాదుల దాడిలో ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. చాలా మంది ఆచూకీ ఇంకా లభించలేదు. శవాల ఆచూకీ కనుక్కోవడం సైన్యానికి, అధికారులకు చాలా కష్టమవ్వడంతో పక్షుల సాయంతో ఈ ప్రత్యేక ఆపరేషన్ చేపట్టారు. వన్యప్రాణుల సంరక్షకులు ఈ పక్షులపై ట్రాకింగ్ పరికరాలను అమర్చారు. ఆ పక్షులు బాధితుల మానవ అవశేషాల సమాచారాన్ని సైన్యానికి తిరిగి చేరవేస్తున్నాయి.
గద్దలు, రాబందుల కాళ్లకు జియోట్యాగ్‌లు కట్టి వదులుతున్నారు. అవి కుళ్లిపోయిన శవాలు ఉండే చోట వాలుతుంటే జియోట్యాగ్ ఆధారంగా గుర్తిస్తున్నారు. మృతదేహాల ఆచూకీ కనుక్కోవడం అధికారులకు కష్టంగా మారడంతో వందలాది రాబందులకు జియోట్యాగ్ చేసి మృతదేహాలను గుర్తిస్తున్నారు. ఇజ్రాయెల్ పదాతి దళాలు గాజా సిటీలోకి అడుగుపెట్టాయి. వీధుల్లో కవాతు చేస్తూ హమాస్ మిలిటెంట్ల కోసం గాలిస్తున్నాయి. గాజా సిటీలో రోగులు, క్షతగాత్రులతోపాటు వేలాదిగా పాలస్తీనియన్లు ఆశ్రయం పొందుతున్న అల్–షిఫా హాస్పిటల్ చుట్టూ ఇజ్రాయెల్ సేనలు మోహరించాయి. ఉత్తర గాజాపై హమాస్ మిలిటెంట్లు పట్టు కోల్పోయారని ఇజ్రాయెల్ మిలటరీ అధికార ప్రతినిధి రేర్ అడ్మిరల్ డేనియల్ హగారి ప్రకటించారు. ఉత్తర గాజాలో హమాస్ పట్టు కోల్పోయిన విషయం అక్కడి ప్రజలకు కూడా తెలుసునన్నారు. అందుకే ప్రజలు ఉత్తర గాజా నుంచి దక్షిణ భాగానికి వలసవెళ్తున్నారని డేనియల్ వెల్లడించారు. గాజాలో ప్రస్తుతానికి కాల్పులు విరమించేది లేదని స్పష్టం చేశారు. ప్రజలు దక్షిణ గాజాకు వెళ్లేందుకు వీలుగా నిర్ణీత సమయాల్లో విరామం ఇస్తున్నట్లు చెప్పారు. ప్రజలు ఉత్తర గాజాను విడిచి దక్షిణానికి వెళ్లేందుకు వీలుగా యుద్ధానికి రోజూ 4 గంటలు విరామం ఇవ్వడానికి ఇజ్రాయెల్ అంగీకరించింది.