ఇరాక్ లో ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు రెచ్చిపోయారు. ఓ పోలీస్ చెక్ పోస్టును లక్ష్యంగా చేసుకుని ఐసిస్ తీవ్రవాదులు దాడికి పాల్పడ్డారు. ఇరాక్ ఉత్తర ప్రాంతంలోని చెక్ పాయింట్‌పై ఆదివారం తెల్లవారుజామున ఐసిస్ ఉగ్రవాదులు జరిపిన బాంబు దాడిలో 13 మంది పోలీసులు దుర్మరణం పాలయ్యారు. కిర్కుక్ నగరానికి దక్షిణాన 65 కిలోమీటర్ల దూరంలో ఉన్న అల్ రషద్ ప్రాంతంలో ఈ దాడి అర్ధరాత్రి దాటిన తర్వాత జరిగిందని ఇరాక్ సీనియర్ పోలీస్ అధికారి ఒకరు తెలిపారు. ఘటనలో 13 మంది పోలీసులు మరణించారని భద్రతా, వైద్య వర్గాలు ధ్రువీకరించాయి. ఇస్లామిక్ స్టేట్ ఆర్గనైజేషన్ ఉగ్రవాదులు ఫెడరల్ పోలీస్ చెక్‌పోస్ట్‌ను లక్ష్యంగా చేసుకొని దాడి చేశారని ఆయన పేర్కొన్నారు.
భద్రతా దళాల్లోని 13 మంది సభ్యులు మృతి చెందారని, మరో ముగ్గురికి గాయాలయ్యాయని ఆ అధికారి తెలిపారు. అల్ రషాద్ ప్రాంతంలో కిర్కుక్ నగరానికి సమీపంలో గత అర్ధరాత్రి తర్వాత ఈ దాడి జరిగిందని ఇరాక్ భద్రతా బలగాలు వెల్లడించాయి. ఇరాక్ లోని పలు ప్రాంతాలను చేజిక్కించుకునేందుకు ప్రయత్నిస్తున్న ఐసిస్ తీవ్రవాదులు తరచుగా సైన్యం, పోలీసులను లక్ష్యంగా చేసుకుని దాడులకు పాల్పడుతోంది. ఈ ఏడాది జులై 19న రాజధాని బాగ్దాద్ శివారు ప్రాంతంలో బాంబు దాడి జరిపి 30 మంది చనిపోయేలా చేసింది.