కాల్పుల విరమణ ఒప్పందం కుదిర్చేందుకు అమెరికా చేస్తున్న ప్రయత్నాలను ఇరాన్ సైనిక ప్రతినిధి బుధవారం ఎగతాళి చేశారు. అమెరికన్లు కేవలం తమలో తామే చర్చలు జరుపుకుంటున్నారని ఆయన అన్నారు. ఇరాన్ సైనిక దళానికి చెందిన ఖతం అల్-అన్బియా సెంట్రల్ హెడ్ క్వార్టర్స్ ప్రతినిధి, లెఫ్టినెంట్ కల్నల్ ఇబ్రహీం జొల్ఫఘారి, ప్రభుత్వ టెలివిజన్‌లో ప్రసారమైన ఒక రికార్డ్ చేసిన వీడియోలో ఈ ప్రకటన చేశారు.
ఆయన ఇలా అన్నారు.. "మీరు ఇంతకుముందు మాట్లాడిన వ్యూహాత్మక బలం ఇప్పుడు వ్యూహాత్మక వైఫల్యంగా మారింది. తమను తాము ప్రపంచ అగ్రరాజ్యాలమని చెప్పుకునేవారు అలా చేయగలిగితే, వారు ఇప్పటికి ఈ గందరగోళం నుండి బయటపడి ఉండేవారు. మీ ఓటమిని రాజీ అని పిలవకండి. మీ వట్టి వాగ్దానాల శకం ఇప్పుడు ముగిసింది. మీ అంతర్గత విభేదాలు.. ఇప్పుడు మీలో మీరే చర్చలు జరిపే స్థాయికి చేరుకున్నాయా?" అని ఆయన అన్నారు. ట్రంప్ ప్రభుత్వం పాకిస్థాన్ ద్వారా ఇరాన్‌కు 15 సూత్రాల కాల్పుల విరమణ ప్రణాళికను పంపిన కొద్దిసేపటికే జోల్ఫఘారి ఈ ప్రకటన చేశారు. మొదటి రోజు నుంచీ మా మొదటి మాట, చివరి మాట ఒకటే.. ఇకపైనా అవే ఉంటాయి.. మా లాంటి వాళ్ళు మీలాంటి వారితో ఎన్నటికీ రాజీపడరు. ఇప్పుడూ కాదు, ఎప్పటికీ కాదు అని జోల్ఫఘారి అన్నారు.