ఇరాన్ అంతటా ఇప్పటివరకు జరిగిన నిరసనలలో 500 మంది భద్రతా సిబ్బందితో సహా 5,000 మంది మరణించారని నివేదికలు అందాయి. ఉగ్రవాదులు, సాయుధ నిరసనకారులు అమాయక పౌరులను లక్ష్యంగా చేసుకున్నారని ఇరాన్ అధికారులు ఆరోపించారు. ఇరాన్ ప్రభుత్వం నిరసనలను అణచివేసింది. స్నైపర్ ఫైరింగ్, మెషీన్ గన్లతో జరిపిన దాడుల్లో వేలాది మంది ప్రాణాలు కోల్పోయారని నివేదికలు వచ్చాయి.
ఇరాన్‌లో జరిగిన ప్రభుత్వ వ్యతిరేక నిరసనల విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తమను నమ్మించి మోసం చేశాడని, ద్రోహానికి పాల్పడ్డాడని అక్కడి ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ట్రంప్ ఇచ్చిన హామీలను నమ్మి తాము రోడ్లపైకి వస్తే, ఆయన తమను నట్టేట ముంచాడని ఆవేదన చెందుతున్నారు. ఇరాన్‌లో ఆర్థిక సమస్యలపై మొదలైన ఆందోళనలు ప్రభుత్వ మార్పు డిమాండ్‌తో ఉద్ధృతంగా మారినప్పుడు, ట్రంప్ సోషల్ మీడియా వేదికగా నిరసనకారులకు మద్దతు ప్రకటించారు. "త్వరలోనే సహాయం అందుతుంది" అని, శాంతియుత నిరసనకారులపై హింసకు పాల్పడితే అమెరికా చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు.