సిలికాన్ వ్యాలీ దిగ్గజం, ఇంటెల్ కార్ప్ సహ వ్యవస్థాపకుడు గోర్డన్ మూర్ కన్నుమూశారు. ఆయన వయసు 94 ఏళ్లు. హవాయిలో ఆయన తుది శ్వాస విడిచారు. 1950 దశకంలో ఆయన సెమీకండక్టర్ల వ్యాపారం మొదలుపెట్టారు. ఆ తర్వాత ఆయన ఇంటెల్ కార్పొరేషన్ సంస్థను స్థాపించారు. ప్రతి ఏడాది కంప్యూటర్ ప్రాసెసింగ్ పవర్స్ రెట్టింపు అవుతుందని ఆయన అంచనా వేశారు. సెమీకండక్టర్ పరిశ్రమలో మార్గదర్శకుడని చెబుతారు. "మూర్స్ లా" కూడా బాగా ఫేమస్.
1968లో ఇంటెల్‌ను సహ-ప్రారంభించడం ద్వారా మూర్ టెక్నాలజీ దిగ్గజాల సరసన చేరారు. కంప్యూటర్ ప్రాసెసర్ ఇండస్ట్రీలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చారు. పీసీ రెవల్యూషన్‌లో ఆయన పాత్ర ప్రత్యేకమైంది. మెమోరీ చిప్స్ తయారీలోనూ మూర్ తనదైన ముద్ర వేశారు. ఎన్నో కంప్యూటర్‌లలో "ఇంటెల్" ప్రాసెసర్‌లు ఉన్న సంగతి తెలిసిందే. PC విప్లవానికి రెండు దశాబ్దాల ముందే ఆయన ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ల గురించి అంచనా వేశారంటే ఆయన ఎంత ముందు చూపుతో ఆలోచించారో అర్థం చేసుకోవచ్చు. సిలికాన్ చిప్స్ మరింత సమర్థవంతంగా, తక్కువ ఖరీదుతో అందుబాటులోకి తీసుకుని వచ్చారు. "తాను సెమీకండక్టర్ పరిశ్రమలో ప్రారంభ దశలోనే ప్రవేశించి చాలా అదృష్టం చేసుకున్నానని" మూర్ 2005లో ఒక ఇంటర్వ్యూలో చెప్పారు.