ఆ బుద్ధి మార‌దు.. ధ్వంసమైన లష్కర్ ప్రధాన కార్యాలయ పునరుద్ధరణకు కోట్లు కేటాయించిన‌ పాక్ ప్రభుత్వం..!

పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత సైన్యం పాకిస్థాన్‌లో ఆపరేషన్ సింధూర్ ప్రారంభించింది. మే 7వ తేదీ రాత్రి, భారత సైన్యం సరిహద్దు వెంబడి విధ్వంసం సృష్టించింది

By -  అంజి
Published on : 14 Sept 2025 12:08 PM IST

Lashkar, Muridke Resurrection, Operation Sindoor, Pakistan, international news, Pahalgam attack

ఆ బుద్ధి మార‌దు.. ధ్వంసమైన లష్కర్ ప్రధాన కార్యాలయ పునరుద్ధరణ ప్రారంభం.. కోట్లు కేటాయించిన‌ పాక్ ప్రభుత్వం..!

పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత సైన్యం పాకిస్థాన్‌లో ఆపరేషన్ సింధూర్ ప్రారంభించింది. మే 7వ తేదీ రాత్రి, భారత సైన్యం సరిహద్దు వెంబడి విధ్వంసం సృష్టించింది, వాటి జాడలు ఇప్పటికీ పాకిస్తాన్ గడ్డపై ఉన్నాయి. పంజాబ్‌లోని మురిద్కేలో ఉన్న లష్కరే తోయిబా (ఎల్‌ఈటీ) ప్రధాన కార్యాలయం మర్కజ్ తైబా కూడా ఆపరేషన్ సిందూర్ సమయంలో నేలమట్టమైంది. అయితే.. ఇప్పుడు పాకిస్తాన్ దానిని పునర్నిర్మించాలని యోచిస్తోంది.

భారత ఇంటెలిజెన్స్ ఏజెన్సీల పత్రం ప్రకారం.. ఉగ్రవాద స్థావరాన్ని పునరుద్ధరించడానికి పాకిస్తాన్ సిద్ధమవుతోంది. గత నెలలో మర్కజ్ తయ్యబా నిర్మాణానికి పెద్ద పెద్ద యంత్రాలు మురిద్కేకు చేరుకున్నాయి.

మే 7 మధ్యాహ్నం 12:35 గంటలకు భారత సైన్యానికి చెందిన మిరాజ్ యుద్ధ విమానాలు సరిహద్దును దాటి మురిద్కే వద్ద క్షిపణులను జారవిడిచాయి. ఈ దాడిలో మర్కజ్ తైబా కూడా నేలకూలింది. ఈ భవనంలో ఉగ్రవాదులకు శిక్షణ ఇవ్వడమే కాకుండా పెద్ద మొత్తంలో ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని కూడా నిల్వ ఉంచారు.

NDTV నివేదిక ప్రకారం.. ఆగష్టు 18న, మురిద్కేలో ఉన్న మర్కజ్ తయ్యబాకు అనేక పెద్ద యంత్రాలు పంపబడ్డాయి. సెప్టెంబరు 4న, ఉమ్ ఉల్ ఖురా అనే పసుపు బ్లాక్‌ను కూడా కూల్చివేశారు. మూడు రోజుల తర్వాత ఎరుపు భవనం కూల్చివేయబడింది.

మురిద్కేలో లష్కరే తోయిబా యొక్క కొత్త ప్రధాన కార్యాలయం 5 ఫిబ్రవరి 2026న కాశ్మీర్ సంఘీభావ దినోత్సవం సందర్భంగా ప్రారంభించనున్న‌ట్లు నివేదిక‌లు చెబుతున్నాయి. ఇంటెలిజెన్స్ ప్రకారం.. ఫిబ్రవరిలోపు ఈ భవనాన్ని పునర్నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రారంభోత్సవం తర్వాత.. ఈ కాంప్లెక్స్ శిక్షణ, బ్రెయిన్ వాష్, ఉగ్రవాద కార్యకలాపాలకు ఉపయోగపడుతుంది.

మర్కజ్ తయ్యబా డైరెక్టర్ మౌలానా అబూ జార్‌తో పాటు ఉస్తాద్ ఉల్ ముజాహిదీన్‌కు మర్కజ్‌ను పునర్నిర్మించే బాధ్యతను అప్పగించారు. ఇది కాకుండా, కమాండర్ యూనస్ బుఖారీకి కార్యాచరణ తనిఖీ బాధ్యతను అప్పగించారు. ఈ పునర్నిర్మాణంలో పాకిస్థాన్ ప్రభుత్వం కూడా కీలక పాత్ర పోషిస్తోంది.

ఇంటెలిజెన్స్ ప్రకారం, ఆగస్టులో పాకిస్తాన్ ప్రభుత్వం లష్కరే తోయిబాకు రూ.4 కోట్లు అందించింది. అదే సమయంలో, మర్కజ్‌ను పూర్తిగా సిద్ధం చేయడానికి సుమారు రూ.15 కోట్లు అవసరం. పాకిస్థాన్ ప్రభుత్వ ఈ చర్య దాని ద్వంద్వ వైఖరిని బట్టబయలు చేస్తోంది.

పాకిస్థాన్‌లోని పలు ప్రాంతాల్లో వరదలు విల‌య తాండవం చేస్తున్నాయి. అటువంటి పరిస్థితిలో కూడా పాక్‌ లష్కరే తోయిబాకు సహాయం చేస్తంది. అదికాకుండా.. వరదల్లో ప్రజలను ఆదుకుంటామనే పేరుతో లష్కరే తోయిబా కూడా భారీగా డబ్బులు వసూలు చేస్తోంది. మానవతా సాయం పేరుతో లష్కరే నాటకాలు ఆడడం ఇదే తొలిసారి కాదు. గతంలో 2005లో పాకిస్థాన్‌లో భూకంపం వచ్చింది. విపత్తు బాధితులకు సహాయం అందించే పేరుతో లష్కర్ బిలియన్ల డాలర్లు సేకరించి అందులో 80 శాతం తన వద్దే ఉంచుకుంది. ఈ డబ్బుతో లష్కరే తన ప్రధాన కార్యాలయాన్ని మురిడ్కేలో, మర్కజ్ అబ్బాస్ కోట్లిలో నిర్మించినట్లు విచారణలో తేలింది.

Next Story