రక్షణగా నాటో దళాలు.. రష్యా ఆ దేశంపై యుద్ధానికి దిగేనా..

India's Travel Advisory For Citizens, Students In Ukraine Amid Crisis. ఉక్రెయిన్‌పై రష్యా దాడి చేసే అవకాశం ఉందని ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలన్‌ స్కీ ఫేస్‌బుక్‌లో

By Medi Samrat  Published on  15 Feb 2022 1:54 PM IST
రక్షణగా నాటో దళాలు.. రష్యా ఆ దేశంపై యుద్ధానికి దిగేనా..

ఉక్రెయిన్‌పై రష్యా దాడి చేసే అవకాశం ఉందని ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలన్‌ స్కీ ఫేస్‌బుక్‌లో ఓ పోస్ట్ చేయడం సంచలనం రేపుతోంది. బుధవారం నాడు ఉక్రెయిన్ పై రష్యా బలగాలు దాడికి దిగుతాయని తమకు సమాచారం అందినట్లు చెప్పారు. దేశ‌ ప్రజలంతా ఐకమత్యంగా ఉండాలని రేపు ఐక్యతా దినోత్సవం జరుపుకోవాలని సూచించారు. ర‌ష్యా-ఉక్రెయిన్ మ‌ధ్య ప‌రిస్థితులు ఆందోళ‌న‌క‌రంగా మార‌డంతో ఉక్రెయిన్ రాజధాని కీవ్లో ఉన్న అమెరికా రాయబార కార్యాలయాన్ని పశ్చిమాన ఉన్న లివివ్ నగరానికి తరలిస్తున్నట్లు అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకన్ తెలిపారు.

రష్యా ఇప్పటికే సరిహద్దుల్లో లక్షకు పైగా సైనిక బలగాలను మోహరించింది. దీనిపై నాటో దేశాలు అప్ర‌మ‌త్త‌మ‌య్యాయి. ఉక్రెయిన్ పై రష్యా దాడి చేయడానికి సిద్ధ‌మైంద‌ని అమెరికా ఇప్పటికే ప్ర‌క‌టించింది. ర‌ష్యా దాడికి దిగితే తీవ్ర పరిణామాలు ఉంటాయ‌ని అమెరికా హెచ్చ‌రిస్తోంది. ఉక్రెయిన్ స‌రిహ‌ద్దుల వ‌ద్ద‌ ర‌ష్యా త‌మ బ‌ల‌గాల‌ను భారీగా మోహ‌రిస్తోంది. బెలారస్‌లో ఉక్రెయిన్‌ సరిహద్దులకు 25 కిలోమీటర్ల దూరంలో భారీగా రష్యా దళాలు ఉన్నాయి. రష్యా దళాలు ఉక్రెయిన్‌ను ఉత్తర, తూర్పు, దక్షిణ దిశల నుంచి చుట్టుముడుతున్నాయి. రష్యాను సమర్థంగా అడ్డుకుంటామని ఉక్రెయిన్‌ చెబుతోంది. రష్యా ఆక్రమించుకున్న‌ క్రిమియా సరిహద్దుల సమీపంలో ఉక్రెయిన్‌ దళాలు ఇప్ప‌టికే కవాతు నిర్వ‌హించాయి. నాటోతో ఉక్రెయిన్ చాలా ఏళ్లుగా స‌త్సంబంధాలు కొన‌సాగిస్తుండ‌డంతో ఆ కూట‌మిలోని దేశాలు ఉక్రెయిన్‌కు సాయంగా నిలుస్తున్నాయి.

ఉక్రెయిన్లో ఉంటున్న భారతీయులు స్వ‌దేశానికి వ‌చ్చేయాల‌ని కేంద్ర ప్రభుత్వం సూచించింది. ఉక్రెయిన్‌లో ఉండ‌డం త‌ప్ప‌నిస‌రికాని భార‌తీయులు వెంట‌నే భార‌త్ వ‌చ్చేయాల‌ని సూచించింది. ఉక్రెయిన్ రాజధాని కీవ్లోని భారత రాయబార కార్యాలయం నుంచి ఈ ప్రకటన విడుదలయింది.


Next Story