విషాదం : చలికి తట్టుకోలేక భారత కుటుంబం మృత్యువాత
Indians’ death in brutal cold. చలికి తట్టుకోలేక ఓ చిన్నారి సహా నలుగురు భారతీయులు ప్రాణాలు కోల్పోయారు.
By Medi Samrat Published on 22 Jan 2022 1:43 PM ISTచలికి తట్టుకోలేక ఓ చిన్నారి సహా నలుగురు భారతీయులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన అమెరికా-కెనడా సరిహద్దుల్లో చోటుచేసుకుంది. చలి తీవ్రత ఎక్కువగా ఉన్న సమయాల్లో సరిహద్దులను దాటేందుకు ప్రయత్నించి ప్రాణాలు కోల్పోయారని అధికారులు తెలిపారు. సరిహద్దుకు 9 నుంచి 12 మీటర్ల దూరంలోనే ఈ ఘటన చోటు చేసుకుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. చనిపోయినవారు సరిహద్దులు వెంబడి 11 గంటల పాటు నడిచి ఉంటారని అధికారులు తెలిపారు. కెనడా-యుఎస్ సరిహద్దు సమీపంలో తీవ్రమైన చలికి ఒక శిశువుతో సహా నలుగురు సభ్యులతో కూడిన భారతీయ కుటుంబం మరణించింది.
"కెనడా-అమెరికా సరిహద్దులో పసిపాపతో సహా నలుగురు భారతీయులు ప్రాణాలు కోల్పోయారనే వార్త దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ పరిస్థితిపై తక్షణమే స్పందించాల్సిందిగా అమెరికా, కెనడాలోని మా రాయబారులను కోరాం" అని భారత విదేశాంగ మంత్రి జయశంకర్ ట్వీట్ చేశారు. ఎమెర్సన్కు సమీపంలో అమెరికా- కెనడా సరిహద్దులో కెనడావైపు గడ్డకట్టుకుపోయిన నాలుగు మృతదేహాలు బుధవారం లభించాయి. ఈ ఘటన చోటు చేసుకున్న ప్రాంతంలో ఉష్ణోగ్రత మైనస్ 35 డిగ్రీలుగా ఉంది. అమెరికా రాయబారి తరణ్జిత్ సంధు, కెనడాలోని ఇండియన్ హైకమిషనర్ అజయ్ బిసారియాతో జైశంకర్ మాట్లాడినట్లు విదేశాంగ శాఖ తెలిపింది.
ఈ సంఘటనను "మనసుని కదిలించే" విషాదంగా పేర్కొంటూ కెనడా ప్రైమ్ మినిస్టర్ ట్రూడో శుక్రవారం వ్యాఖ్యలు చేశారు. కెనడా ప్రభుత్వం యుఎస్ సరిహద్దులో ప్రజలను అక్రమ రవాణాను ఆపడానికి చేయగలిగినదంతా చేస్తోందని అన్నారు. మానవ అక్రమ రవాణాదారుల బాధితులు... మరియు మెరుగైన జీవితాన్ని నిర్మించుకోవాలనే వారి కోరికను సద్వినియోగం చేసుకున్న వ్యక్తులు ఇలా చనిపోవడం చాలా విషాదకరమని ట్రూడో అన్నారు. ప్రజలు సక్రమంగా, అక్రమంగా సరిహద్దులు దాటకుండా మేము చేయగలిగినదంతా చేస్తున్నామన్నారు.